– హామీల ఎగవేతలో మేటి రేవంత్‌రెడ్డి
– అవినీతి చక్రవర్తి – అసమర్థ సీఎం
– స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వాల్సిందే
– ఆంధ్రాలో కలిపిన ఐదు గ్రామాలను తెలంగాణలో విలీనం చేయాలి
– కొత్తగూడెం జాగృతి సమావేశంలో ఎమ్మెల్సీ కవిత
కొత్తగూడెం అర్బన్, జులై 10 : తెలంగాణ రాష్ట్రం గాడిన పడే సమయంలోనే కాంగ్రెస్ చేతిలోకి వెళ్లిందని, దీంతో మళ్లీ మన అస్థిత్వం కోసం పోరాటాలు, ఉద్యమాలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని తెలంగాణ జాగృతి వ్యవస్థాపకురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. జై తెలంగాణ అనని వ్యక్తి సీఎం రేవంత్ రెడ్డి అని, అవినీతి చక్రవర్తి- అసమర్ధ ముఖ్యమంత్రి ఈ రాష్ట్రానికి అవసరమా? అని ఆమె ప్రశ్నించారు. గురువారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం పట్టణంలోని కొత్తగూడెం క్లబ్లో నిర్వహించిన జాగృతి సమావేశంలో ఆమె మాట్లాడారు. తొలుత సీఐటీయూ జిల్లా నాయకుడు, ఉద్యమ కెరటం జి.వీరన్న, వివిధ సంఘాల నాయకులకు జాగృతి కండువా కప్పి సాధరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ.. ఎన్నికల్లో మహిళలకు, దివ్యాంగులకు, యువతకు, విద్యార్ధులకు, వృద్ధులకు ఒకరేమిటీ అందరికీ బీఆర్ఎస్ పార్టీ ఇచ్చిన పథకాల కంటే ఎక్కువే ఇస్తామని, అబద్దపు, మోసపు మాటలు మాట్లాడి హామీలు, గ్యారెంటీలు ఇచ్చి ఒక్కటీ కూడా సక్రమంగా అమలు చేయకుండా, దేవుళ్ల మీద ఒట్టు వేస్తూ సీఎం రేవంత్ రెడ్డి పబ్బం గడుపుకుంటున్నారని విమర్శించారు.
మహిళలకు నెలకు రూ.2,500, దివ్యాంగులకు రూ.8 వేల పెన్షన్, ఇతర పింఛన్‌దారులకు రూ.4 వేలు ఇస్తానని, కల్యాణలక్ష్మీ, షాదీ ముబారక్ పథకం ద్వారా తులం బంగారం ఇస్తానని హామీలు ఇచ్చి ఏ ఒక్కటీ కూడా అమలు చేయకుండా కాలయాపన చేస్తూ యావత్తు తెలంగాణ సమాజాన్ని మోసం చేసిన మోసగాడు రేవంత్ రెడ్డి అని ధ్వజమెత్తారు. అడగకుండానే రైతులకు రైతు బంధు, రైతు బీమా ఇచ్చిన కేసీఆర్, అడిగినా ఇవ్వకుండా తప్పించుకు తిరుగుతూ, అబద్దపు ప్రచారాలతో ప్రజలను తప్పుదోవపట్టిస్తున్న సీఎంకు రానున్న రోజుల్లో ప్రజలు తగిన రీతిలో బుద్ది చెబుతారన్నారు.
Kothagudem Urban : సీఎం రేవంత్‌కు ఎమ్మెల్సీ కవిత సవాల్
బీఆర్ఎస్ పాలనలో రైతులకు వ్యవసాయం పండుగ అయితే, కాంగ్రెస్ ప్రభుత్వంలో దండగలా మారిందని ఆరోపించారు. రైతులకు ఇచ్చిన హామీలపై బీఆర్ఎస్ పార్టీ నాయకులు చర్చకు రమ్మంటే తోకముడిచి జారుకున్నట్లు తెలిపారు. సెక్రటేరియట్ వాస్తు బాగలేదని, పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో మంత్రులతో, అధికారులతో సమావేశాలు పెడుతున్న సీఎంను తాను ఒకటే అడుగుతున్నానన్నారు. మహిళలకు ఇచ్చిన హమీలపై పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్లోనే చర్చ పెడుదామని, నిజంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు అమలు చేస్తే చర్చకు సిద్దపడాలని ఆమె సవాల్ విసిరారు. ఎన్నికలకు ముందు రాహుల్ గాంధీతో సమావేశాలు పెట్టి హామీలు గుప్పించిన కాంగ్రెస్ పార్టీ స్థానిక సంస్థలో 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాల్సిందేనని, లేకుంటే ప్రజలే ఈ ప్రభుత్వ భరతం పడతారని హెచ్చరించారు.
సింగరేణిలో కార్మికుల సంక్షేమం, హక్కులు గాలికి వదిలేశారని, ఆనాడు కేసీఆర్ డిపెండెంట్ ఉద్యోగాలు ఇచ్చి సంస్థను కాపాడుకుంటే నేడు సమస్యలు పట్టనట్లుగా వ్యవహరిస్తూ, బొగ్గు గనులను ప్రైవేట్ పరం చేయాలని చూస్తున్నారని, ప్రైవేట్ పరం చేస్తే ఊరుకునే ప్రసక్తే లేదన్నారు. భద్రాచలం పరిసర ప్రాంతాల్లో ఐటీసీ కర్మాగారం వల్ల కాలుష్యం పెరిగి ప్రజలు ఇబ్బందులుపడుతున్నారని, ముగ్గురు మంత్రులు ప్రజల సమస్యలపై స్పందించి పరిష్కరించే చర్యలు చేపట్టాలన్నారు.
Kothagudem Urban : సీఎం రేవంత్‌కు ఎమ్మెల్సీ కవిత సవాల్
ఆంధ్రప్రదేశ్‌లో కలిపిన ఐదు గ్రామాలను (యటపాక, కన్నాయిగూడెం, గుండాల, పిచ్చుకలపాడు, పురుషోత్తపట్నం) తిరిగి తెలంగాణలో కలుపాలని కవిత అన్నారు. ఈ అంశంపై ప్రధాని మోదీ, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుకి లేఖలు రాస్తున్నట్లు తెలిపారు. ఆ ప్రాంత ప్రజల సమస్యలు అర్థం చేసుకుని తిరిగి భద్రాచలంలో విలీనం చేయాలని ఆమె డిమాండ్ చేశారు. ఈ రాష్ట్ర ప్రజల ఆత్మగౌరవం, అస్థిత్వం కోసం కాంగ్రెస్ పాలనలో మళ్లీ ఉద్యమాలు చేయాల్సిన అవసరం ఏర్పడిందని అందుకే జాగృతిని బలోపేతం చేస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జాగృతి రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు మాధవి, జిల్లా అధ్యక్షురాలు పవన్, గోపు సదానందం, ఎండి.హుస్సేన్, బుద్ది మధుసూదననావు, భూపతి శ్రీనివాస్, రవి, శ్రీనివాసరావు, ఇర్ఫాన్, టీబీజీకేఎస్ రాష్ట్ర సెక్రటరీ జనరల్ కాపు కృష్ణ, రాజేంద్రప్రసాద్, రెంటపల్లి మాధవీలత, సింధు తపస్విని, మధుబాబు, ప్రసాద్ గౌడ్, రాజుగౌడ్ పాల్గొన్నారు.
ఎమ్మెల్సీ కవితకు కొత్తగూడెం జిల్లా జాగృతి నాయకులు ఘన స్వాగతం పలికారు. విద్యానగర్ నుంచి బైక్ ర్యాలీతో యువకులు స్వాగతం పలుకగా పోస్టాఫీస్ సెంటర్లో అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ఆమె నివాళులర్పించారు. అనంతరం కోయ, లంబాడీ నృత్యాలతో, కోలాటం, డప్పు వాయిద్యాల నడుమ టపాకులు కాల్చుతూ బతుకమ్మలతో స్వాగతం పలికారు. బస్టాండ్ సెంటర్లోని అమరవీరుల స్థూపం వద్ద పుష్పాంజలి సమర్పించారు. రోడ్డుకిరువైపులా ఉన్న విద్యార్థులు, యువతీయువకులను చూస్తూ అభివాదం చేస్తూ ఆమె ముందుకు సాగారు.
Kothagudem Urban : సీఎం రేవంత్‌కు ఎమ్మెల్సీ కవిత సవాల్