రామవరం, జనవరి 17 : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చుంచుపల్లి మండలం రుద్రంపూర్ పంచాయతీలోని మసీదు ఏ క్యూబాలో షాబే మేరాజ్ పురస్కరించుకుని శుక్రవారం రాత్రి యాత్రపై ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మౌలానా రహమతుల్లా ముఖ్య వక్తగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సృష్టికర్త అయిన అల్లాహ్ ఒక్కడేనని, ఆయనే మానవుల జనన–మరణాలకు మూల కారణమని తెలిపారు. మరణానంతరం ప్రతి మనిషి తన జీవితంలో చేసిన ప్రతి పనికి సమాధానం చెప్పుకోవాల్సి ఉంటుందన్నారు. ఈ సత్యాలను మానవాళికి తెలియజేసి, దైవభీతితో కూడిన సత్సమాజ నిర్మాణం కోసం పంపబడిన అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అని వివరించారు.
ప్రవక్త ముహమ్మద్ (స.అ.వ) ద్వారా మానవాళికి అందించాల్సిన దైవాదేశాలను తెలియజేయడానికి జరిగిన పరలోక యాత్రనే “మేరాజ్ యాత్ర”గా పిలుస్తారని చెప్పారు. ఈ యాత్ర సందర్భంగా స్వర్గ–నరకాలను ప్రత్యక్షంగా చూపించి, అనేక దైవ సందేశాలు అందించబడినట్లు తెలిపారు. తల్లిదండ్రుల పట్ల మంచితనం, బంధువులు, బాటసారులు, నిరుపేదల పట్ల బాధ్యత, వ్యర్థ ఖర్చులు చేయకపోవడం, పిసినారితనం వహించకపోవడం వంటి ధర్మాలను పాటించాలని సూచించారు.
అదేవిధంగా వ్యభిచారం, వడ్డీ తినడం, అన్యాయమైన కొలతలు, అహంకార ప్రవర్తన వంటి దుష్కర్మల నుంచి దూరంగా ఉండాలని హెచ్చరించారు. వ్యాపారంలో నిజాయితీగా ఉండాలని, అనాథలను ఆదుకోవాలని, తెలియని విషయాలపై అపోహలతో వ్యవహరించకూడదని అన్నారు. దైవ బోధనలకు అనుగుణంగా జీవిస్తేనే సత్ సమాజ నిర్మాణం సాధ్యమవుతుందన్నారు. మరణానంతరం శాశ్వత స్వర్గ సుఖం లభిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జాఫర్ సాబ్, సోను మియా, షమీం, అజార్, ఫహీం యాకుబ్, అఫ్సర్, ముస్లింలు పాల్గొన్నారు.