రామవరం, సెప్టెంబర్ 16 : రోడ్డు దాటుతున్న క్రమంలో వెనుక నుండి వచ్చి ఆటో ఢీకొట్టడంతో కార్మికుడికి తీవ్ర గాయాలైన సంఘటన మంగళవారం సింగరేణి కొత్తగూడెం ఏరియా ప్రగతి వనం వద్ద జరిగింది. బాధితుడి కథనం ప్రకారం.. సింగరేణి కొత్తగూడెం ఏరియా పరిధిలోని పివికె 5 ఇంక్లైన్ లో పనిచేస్తున్న కార్మికుడు దాసరి శ్రీనివాస్ మొదటి షిఫ్ట్ ముగించుకుని ఇంటికి వెళ్తున్న క్రమంలో రుద్రంపూర్ ప్రగతి వనం వద్ద ఉన్న రైల్వే అండర్ బ్రిడ్జి నుండి బయటికి వస్తున్న క్రమంలో( విజయవాడ-జగదల్పూర్ జాతీయ రహదారి) పై నుండి వస్తున్న ఆటో ఒక్కసారిగా శ్రీనివాస్ భుజాన్ని ఢీకొనడంతో శ్రీనివాస్ అదుపుతప్పి ఎదురుగా వచ్చిన వాహనాన్ని ఢీకొని కింద పడడంతో తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే స్థానికులు అతడిని సింగరేణి ప్రధాన ఆస్పత్రికి తరలించారు.
వైద్యులు పరీక్షలు నిర్వహించి కుడి భుజం ప్రాక్చర్ అవడంతో పాటు మూడు పక్కటెముకలు విరిగినట్లు తెలిపారు. ప్రమాద విషయం తెలుసుకుని వెంటనే ఏఐటీయూసీ పిట్ సెక్రెటరీ ఎస్కే హ్యుమాయన్, పీవీకే 5 ఇంక్లైన్ మేనేజర్ శ్యామ్ ప్రసాద్, సంక్షేమ అధికారి షకీల్ ఆస్పత్రికి వెళ్లి దాసరి శ్రీనివాస్‌ను పరామర్శించారు. తలకు హెల్మెట్ ధరించడం వల్ల ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడ్డాడు.
పీవీకే 5 ఇంక్లైన్, సివిల్ ఆఫీస్, ఎస్ అండ్ పిసి సిబ్బంది నిత్యం విధులకు వెళ్లి రావాలంటే జాతీయ రహదారి నుండి ప్రగతి వనం వద్ద ఉన్న రైల్వే అండర్ బ్రిడ్జి నుండి వెళ్లాల్సి వస్తుంది. ఇక్కడ విజయవాడ నుండి కొత్తగూడెం వైపు వెళ్లే వాహనాలు అతివేగంగా వస్తూ ఉంటాయి. గతంలో ఇక్కడ అనేక ప్రమాదాలు జరిగాయి. ఇటీవల పీవీకే 5 ఇంక్లైన్ చెందిన ఒక ఉద్యోగిని వెనుక నుండి కారు వచ్చి ఢీకొన్న సంఘటన మరువకముందే మంగళవారం శ్రీనివాస్ ప్రమాదానికి గురయ్యాడు. నిత్యం ఏదో ఒక ప్రమాదం జరగడం పరిపాటిగా మారింది. కానీ అధికారులు మాత్రం పట్టింపులేని విధంగా ఉంటున్నారు. వేగ నియంత్రణ కోసం గతంలో డ్రమ్ములను ఏర్పాటు చేశారు. అవి పాడైపోయిన తర్వాత ఎవరూ పట్టించుకోలేదు. ఇప్పటికైనా అధికారులు స్పందించి వేగం నియంత్రణ డ్రమ్ములను ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.