బూర్గంపహాడ్, జూలై 20 : బూర్గంపహాడ్ మండల పరిధిలోని సారపాకలో ఐటీసీ పీఎస్పీడీలో కాంట్రాక్టు కార్మికుడిగా పని చేస్తున్న మహిముద్దీన్ ఖాన్ కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతూ భద్రాచలం ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. అదేవిధంగా కోయగూడెం పంచాయతీకి చెందిన షేక్ యాకూబ్ ప్రమాదవశాత్తు జారి పడడంతో గాయాలపాలై అనారోగ్యానికి గురయ్యాడు. బాధితుల కుటుంబ సభ్యులు ముస్లిం ఎంపవర్మెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ (మేవా)ను సంప్రదించగా ఒక్కో బాధిత కుటుంబానికి రూ.10 వేల చొప్పున రూ.20 వేలు ఆర్ధిక సాయం అందజేశారు. ఈ సందర్భంగా మేవా అధ్యక్షుడు మహమ్మద్ ముస్తఫా మాట్లాడుతూ ఆపదలో ఉన్న నిరుపేద కుటుంబాలకు మేవా తరపున తమవంతు సహాయ, సహకారాలు అందిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మేవా ప్రధాన కార్యదర్శి జహీర్ బాషా, సోహెల్పాషా, సైదుద్దీన్, అక్బర్, అబ్దుల్ సలీమ్, అజీజ్ ఉస్మాన్ పాల్గొన్నారు.