రామవరం, మే 23 : వైద్య సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా డీఎంహెచ్ఓ డాక్టర్ భాస్కర్ నాయకల్ అన్నారు. శుక్రవారం కొత్తగూడెం మున్సిపాలిటీ పరిధిలో గల చిట్టీ రామవరం బస్తీ దవాఖానను, పాత కొత్తగూడెం ఆరోగ్య కేంద్రాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఓపీ సేవలపై ప్రజలను అడిగి తెలుసుకున్నారు. ఎమర్జెన్సీ మందుల నిర్వహణ, ఐపీ నిర్వహణ, బీపీ, షుగర్ వ్యాధిగ్రస్తులకు మందుల పంపిణి చేయడం, టీహెచ్యూబీ రక్త పరీక్ష నమూనాలు సేకరించడం చేయాలని, అత్యవసరమైన మందులు అన్ని వేళలా అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు.
అలాగే బయో మెడికల్ వేస్ట్ మేనేజ్మెంట్ నిర్వహించాలని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. అనంతరం పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పాత కొత్తగూడెంను సందర్శించారు. జ్వరం, వాంతులు, విరోచనాలు కేసుల పట్ల అప్రమత్తంగా ఉండాలని డాక్టర్ రాకేశ్ సూచించారు. వడదెబ్బ భారిన పడకుండా ప్రజలకు ఆరోగ్య విద్యా బోధన చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ అజయ్, పాయం శ్రీనివాస్, రాంప్రసాద్, బస్తీ దావఖానా సిబ్బంది పాల్గొన్నారు.