జూలూరుపాడు, మే 09 : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండల కేంద్రంలో అపురూప దృశ్యం ఆవిష్కృతమైంది. మండల కేంద్రానికి చెందిన విశ్రాంత ఉపాధ్యాయుడు సున్నం రామకృష్ణమాచారి నివాసంలో ‘మే పుష్పం’ వికసించి చూపరులను కట్టిపడేస్తోంది. సాధారణంగా మే నెలలో మాత్రమే పూసే ఈ పుష్పం ప్రత్యేకత ఎర్రటి రంగులో, గుండ్రంగా బంతి ఆకారంలో ఉండే ఈ పువ్వు చూడటానికి ఎంతో ఆకర్షణీయంగా ఉంటుంది. వర్షాకాలం ప్రారంభ సూచికగా, ఎండల తీవ్రత ఎక్కువగా ఉన్న తరుణంలో వికసించే ఈ ‘మే ఫ్లవర్’ ఏడాది పొడవునా మొక్క దశలో ఉండి, కేవలం ఈ సీజన్లో మాత్రమే తన అందాలను వెదజల్లుతుంది. అరుదుగా కనిపించే ఈ పువ్వును చూసేందుకు చుట్టుపక్కల ప్రజలు ఆసక్తి చూపుతున్నారు.