– తప్పిన ప్రాణనష్టం
– ప్రభుత్వం ఆదుకోవాలని బాధితురాలి వేడుకోలు
జూలూరుపాడు, జూన్ 03 : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం వినోబానగర్ గ్రామంలో మంగళవారం రాత్రి వీచిన ఈదురుగాలులు, వర్షానికి ఓ భారీ చింతచెట్టు విరిగి ఇంటిపై పడడంతో ఓ ఇల్లు తీవ్రంగా దెబ్బతింది. గ్రామానికి చెందిన సిరికొండ లక్ష్మీ ఇంటి సమీపంలో ఉన్న భారీ చింతచెట్టు ఒక్కసారిగా విరిగి ఇంటిపై పడింది. ఆ సమయంలో ఇంట్లో కుటుంబ సభ్యులు ఉన్నప్పటికీ అదృష్టవశాత్తూ ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. అయితే భారి చెట్టు ఇంటిపై పడడంతో ఇంటి పైకప్పు, గోడలు, రేకులు తీవ్రంగా దెబ్బతిన్నాయి. దీంతో నష్టాన్ని పరిశీలించి ప్రభుత్వం, రెవెన్యూ అధికారులు వెంటనే స్పందించి తగిన ఆర్థిక సహాయం అందించి తమ కుటుంబాన్ని ఆదుకోవాలని బాధితురాలు కోరింది. గ్రామ సర్పంచ్ గంగావత్ నవీన్ స్థానిక నాయకులతో కలిసి ప్రమాద స్థలాన్ని పరిశీలించారు. బాధితురాలికి ఆర్థిక సహాయం అందజేసి అండగా ఉంటామని, ప్రభుత్వం తరఫున వచ్చే ఆర్థిక సహాయాన్ని అందించేందుకు కృషి చేస్తామని తెలిపారు.