జూలూరుపాడు, ఏప్రిల్ 22 : ఈ నెల 25, 26, 27 తేదీల్లో ఖమ్మం నగరంలో జరిగే భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ 5వ రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయాలని ఎస్ఎఫ్ఐ జిల్లా కమిటీ సభ్యుడు పెరుమాళ్ల పవన్ కుమార్ కోరారు. మంగళవారం జూలూరుపాడు మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాలలో మహాసభల పోస్టర్ను విద్యార్థులతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రాష్ట్రంలో 10 లక్షల సభ్యత్వంతో అతిపెద్ద విద్యార్థి సంఘంగా ఎస్ఎఫ్ఐ ఉందని తెలిపారు. విద్యారంగంలో కార్పొరేటీకరణ, ప్రైవేటీకరణ, కేంద్రీకరణ, వ్యాపారీకరణతో పాటు నూతన సంస్కరణ పేరుతో తీసుకువస్తున్న విధానాలను వ్యతిరేకిస్తూ, విద్యార్థులందరినీ ఐక్యం చేసి దేశవ్యాప్తంగా అనేక పోరాటాలు చేస్తున్నట్లు చెప్పారు.
కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం విద్యార్థులకు విద్యను దూరం చేసేలా నూతన విద్యా విధానం తీసుకొచ్చిందని విమర్శించారు. రాష్ట్రంలో నూతనంగా అధికారం చేపట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం విద్యారంగాన్ని మరింత సంక్షోభంలోకి నెట్టే విధానాలు అమలు చేస్తుందని దుయ్యబట్టారు. రాష్ట్రంలో పెండింగ్ స్కాలర్షిప్స్, ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సంక్షేమ, గురుకుల వసతి గృహాలకు సొంత భవనాలు నిర్మించాలని, పాఠశాలలకు మౌలిక సదుపాయాలు కల్పించి సమస్యలు పరిష్కరించాలన్నారు.
ఎస్ఎఫ్ఐ కేవలం ఉద్యమాలు, పోరాటాలు మాత్రమే కాకుండా సేవా కార్యక్రమాలు కూడా నిర్వహిస్తుందన్నారు. విద్యార్థుల్లో సృజనాత్మకతను పెంపొందించేందుకు అనేక అంశాలపై అవగాహన సదస్సులు, మహిళల రక్షణకై సదస్సులు, టాలెంట్ టెస్ట్ లు, రక్తదాన శిబిరాలు, శ్రమదానాలను నిర్వహిస్తుందన్నారు. విద్యారంగ పరిరక్షణకు, విద్యార్థి పోరాటాలకు దిక్సూచి కాస్తున్న ఎస్ఎఫ్ఐ 5వ రాష్ట్ర మహాసభలను విద్యార్థులు, మేధావులు, సామాజికవేత్తలు అంతా కలిసి జయప్రదం చేయాలని కోరారు.