జూలూరుపాడు, జూలై 01 : అనేక పోరాటాలతో సాధించుకున్న 44 కార్మిక చట్టాలను నిర్వీర్యం చేసి వాటి స్థానంలో నాలుగు లేబర్ కోడ్ లను ప్రవేశపెట్టిన కేంద్ర ప్రభుత్వం, ప్రధాని మోదీ నిరంకుష విధానానికి వ్యతిరేకంగా ఈ నెల 9వ తేదీన జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని ఏఐటీయూసీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడు కంచర్ల జములయ్య పిలుపునిచ్చారు. మంగళవారం జూలూరుపాడులో జరిగిన ఏఐటీయూసీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో అయన మాట్లాడారు. ప్రధాని మోదీ ప్రభుత్వం కార్మికుల హక్కులను కాలరాసే విధంగా చట్టాలను తొలగించి, యాజమాన్యానికి అనుకూలంగా ఉండే లేబర్ కోడ్ లను తీసుకువచ్చి తన వక్ర బుద్ధి చూపించిందన్నారు.
2014-19, అలాగే 2019 నుండి 24 మధ్యలో మోదీ ప్రభుత్వం సంఘటిత, సంఘటితంగా కార్మికుల కోసం ఖర్చు చేసిన మొత్తం లక్ష కోట్లు కూడా లేదన్నారు. పది సంవత్సరాల కాలంలో లక్ష కోట్లు కూడా లేవంటే సంవత్సరానికి కేవలం పది వేల కోట్ల రూపాయలు మాత్రమేనన్నారు. కానీ ఇదే సందర్భంలో 10 సంవత్సరాల కాలంలో కార్పొరేట్ల శక్తులకు 16 లక్షల 53 వేల కోట్ల రుణాలను మాఫీ చేసినట్లు వారు ఈ సందర్భంగా వెల్లడించారు.
కార్మికుల హక్కుల సాధనకై జులై 9వ తేదీన జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయడానికి సంఘటిత అసంఘటిత రంగ కార్మికులందరూ ఏకమవ్వాలని పిలుపునిచ్చారు. గ్రామీణ ప్రాంతాల్లో నిరుపేదలను ఇబ్బందులకు గురి చేస్తున్న మైక్రో ఫైనాన్స్ లపై చర్యలు తీసుకోవాలన్నారు. డబ్బులు కట్టమని ఇబ్బందులకు గురి చేస్తే గ్రామాల్లో అడ్డుకుంటామని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సీపీఐ మండల కార్యదర్శి గుండెపిన్ని వెంకటేశ్వర్లు, సహాయ కార్యదర్శి ఎస్కే నాగుల్ మీరా, ఏఐటీయూసీ నాయకులు గుడిమెట్ల సీతయ్య, ఎస్.కె చాంద్ పాషా, వలమల్ల సామేలు, నిమ్మటూరి లచ్చయ్య, పానుగంటి మహేశ్, గార్లపాటి వీరభద్రం, బాపట్ల పూర్ణచందర్రావు పాల్గొన్నారు.