కొత్తగూడెం అర్బన్, ఆగస్టు 26 : మట్టి విగ్రహాలతో వినాయక చవితి పండుగ జరుపుకోవడం ద్వారా పర్యావరణ పరిరక్షణ దిశగా అడుగులు వేద్దామని కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. మంగళవారం కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో కార్పొరేషన్ పరిధిలోని పలు సెంటర్లలో ఏర్పాటు చేసిన మట్టి విగ్రహాల పంపిణి కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ మట్టి వినాయక విగ్రహాలతోనే పండగ జరుపుకోవాలన్నారు. కాలుష్య నివారణ ప్రతి ఒక్కరి బాధ్యత అన్నారు. మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో 3 వేల మట్టి విగ్రహాలను పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు.
నియోజకవర్గ పరిధిలో గణేష్ మండపాల వద్ద పారిశుధ్య పనులు చేపట్టాలని, విద్యుత్ సౌకర్యం కల్పించాలని, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పొలీస్ శాఖ కఠినంగా వ్యవహరించాలని సూచించారు. పండుగను పురస్కరించుకుని నియోజకవర్గ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్కే సాబీర్ పాషా, కార్పొరేషన్ కమిషనర్ సుజాత, అధికారులు అహ్మద్, వీరభద్రా చారి, రంగ ప్రసాద్, మాజీ మున్సిపల్ కౌన్సిలర్లు, నాయకులు ఎస్కే ఫహీమ్, గెడ్డాడు నగేశ్, కేశవరావు, యూసుఫ్, బోయిన విజయ్ కుమార్, సత్యనారాయణాచారి, దుర్గ, సతీశ్ బాబు, నర్సింహా, అజీజ్, నీడల సుధాకర్ పాల్గొన్నారు.