జూలూరుపాడు, జూలై 20: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండల పరిధిలోని నలబండ బోడు గ్రామంలో జూలూరుపాడు ప్రెస్ క్లబ్ సీనియర్స్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత మెగా ఆరోగ్య శిబిరాన్ని జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ ముఖ్య అతిథిగా హాజరై వైద్య శిబిరాన్ని ఆదివారం ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎస్పీ రోహిత్‌రాజ్ మాట్లాడుతూ.. మారుమూల అటవీ ప్రాంతానికి సమీపంలో ఉంటున్న అడవి బిడ్డల ఆరోగ్యం పట్ల శ్రద్ధ కనపరిచి వైద్య శిబిరం ఏర్పాటు చేయడం అభినందనీయమని ప్రెస్ క్లబ్ సభ్యులను అభినందించారు. నిరుపేదలకు ఆరోగ్య సేవలు అందించడం గొప్ప విషయం అన్నారు. జూలూరుపాడు మండలంలోని మారుమూల గ్రామమైన నల్ల బండ బోడు గ్రామం గత పది సంవత్సరాల నుంచి స్థానిక పోలీస్ స్టేషన్ నందు ఎటువంటి కేసులు లేకుండా ఉత్తమమైన గ్రామంగా ఉందని గ్రామ ప్రజలను అభినందించారు. గ్రామంలో ప్రతి తల్లిదండ్రులు పిల్లలను మంచిగా చదివించాలని కొంత మేరకు చదువులు చదివించిన ఆ చదువుకు తగ్గ ఉద్యోగాలు మేరకు దగ్గరలో ఉన్న పట్టణాలకు పంపించడం ద్వారా గ్రామంలో ఉన్నటువంటి మిగతా వారంతా చదువుకోవాలని ఆసక్తి పెరుగుతుందన్నారు. అడవి ప్రాంతానికి దగ్గరగా ఉన్న గ్రామం కనుక విషపురుగుల నుంచి జాగ్రత్తగా ఉండాలని సూచించారు. వర్షాకాలం మొదలైనందున వైరల్ ఇన్ఫెక్షన్స్ సోకకుండా ఉండాలంటే ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచనలు ఇచ్చారు.