– కార్యక్రమాన్ని కవర్ చేసేందుకు గుంత పూడిక
– నిర్లక్ష్యాన్ని కప్పిపుచ్చుకుంటున్న అధికార యంత్రాంగం
కొత్తగూడెం ప్రగతి మైదాన్, నవంబర్ 14 : జిల్లా కేంద్రమైన కొత్తగూడెంలో రహదారులు ప్రమాదాలకు కేరాఫ్ అడ్రస్ గా మారుతున్నాయి. నిత్యం జిల్లా స్థాయి అధికారులు ఈ రహదారుల్లో సంచరిస్తూ కూడా నిద్ర నటిస్తున్నట్లు అవగతం అవుతుంది. ఏదైనా కార్యక్రమం జరిగితే తప్పా గుంతలు తాత్కాలికంగా పూడ్చి తప్పులను కప్పిపుచ్చుకునే విధంగా వ్యవహరిస్తున్నారు. ఇందుకు శుక్రవారం జరిగిన “చైతన్యం” కార్యక్రమంలో సాక్షాధార దృశ్యం దర్శనమిచ్చింది. మాదక ద్రవ్యాలను నిర్మూలించేందుకు నెల రోజుల పాటు జరిగిన “చైతన్యం” కార్యక్రమం ముగింపులో భాగంగా జిల్లా పోలీస్ అధికారులు లక్ష్మీదేవిపల్లి మండలంలోని మార్కెట్ యార్డ్ నుంచి కొత్తగూడెం ప్రకాశం స్టేడియం వరకు అన్ని శాఖల అధికారులు, సిబ్బంది, విద్యార్థులతో భారీ ర్యాలీ నిర్వహించారు. అయితే కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని అండర్ బ్రిడ్జి వద్ద భారీ గుంతలు ఏర్పడి ఆ ప్రాంతం ప్రమాద భరితంగా మారింది. ఆ ప్రాంతంలో నిత్యం ప్రమాదాలు చోటుచేసుకుంటూనే ఉన్నాయి.
నిత్యం జిల్లా అధికారులందరూ ఈ రహదారి మార్గంలోనే ప్రయాణం చేస్తూ ఉంటారు. అయినా కూడా ఇక్కడ గుంతలు ఏర్పడి నెలలు గడుస్తున్నా పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. ఏదైనా ప్రభుత్వం నిర్వహించే కార్యక్రమంలో అధికారులు వస్తుంటే గుంతలు పూడ్చి హడావిడి చేస్తుంటారు. శుక్రవారం జరిగిన చైతన్యం కార్యక్రమంలో జిల్లా యంత్రాంగం మొత్తం ర్యాలీగా వస్తున్న క్రమంలోనే అండర్ బ్రిడ్జి వద్ద గుంతలు పూడుస్తూ తాత్కాలిక మరమ్మతులు చేయించారు. ఈ దృశ్యం చూసిన స్థానిక ప్రజలు, వాహనదారులు వీఐపీలు వస్తే తప్పా ప్రమాదంగా మారిన రహదారులను పట్టించుకోరా? అంటూ విమర్శలు గుప్పించారు. కొత్తగూడెంలోని మరేడువాగు బ్రిడ్జి, గోధుమ వాగు బ్రిడ్జిలపై కూడా గుంతలు పడి ప్రమాదకరంగా మారాయి. ఇప్పటికైనా జిల్లా యంత్రాంగం ప్రమాద భరితంగా మారిన ఈ రహదారులపై దృష్టి సారించి వెంటనే సరైన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

Kothagudem Pragathi Maidan : తాత్కాలిక “చైతన్యం”