కొత్తగూడెం అర్బన్, ఏప్రిల్ 05 : భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో లంబాడ సామాజికవర్గం వారు అత్యధిక జనాభా, అత్యధిక ఓటర్లు కలిగి ఉన్నారని కావునా కొత్తగూడెం మార్కెట్ కమిటీ చైర్మన్ పదవిని లంబాడీలకు కేటాయించాలని నగరభేరి- లంబాడీ హక్కుల పోరాట సమితి రాష్ర్ట అధ్యక్షుడు రాజేశ్ నాయక్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అలాగే రాష్ట్రంలో లంబాడి సామాజిక వర్గం వారికి మంత్రి వర్గంలో స్థానం కల్పించాలన్నారు. శనివారం కొత్తగూడెం పట్టణంలోని బస్టాండ్ సెంటర్లో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని 5 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 1-జనరల్, 4-ST రిజర్వ్డ్ ఉన్నాయని, నాలుగు ST అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూడా తమ సోదరులైన ST (కోయ) సామాజికవర్గం వారే ప్రాతినిధ్యం వహిస్తున్నట్లు తెలిపారు.
జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, అటవీ కార్పొరేషన్ చైర్మన్ పదవి కూడా ST (కోయ) వర్గానికి చెందినవారికే కేటాయించారు. మార్కెట్ చైర్మన్ పదవులు 1.చర్ల, 2.భద్రాచలం, 3.దమ్మపేట, 4.బూర్గంపాడు లకు కూడా తమ సోదరులైన ST-కోయ సామాజిక వర్గం వారికి కేటాయించారని, ఇది తమకు కూడా సంతోషదాయకమే అన్నారు. అయితే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత తమ మధ్య విబేధాలు సృష్టించడానికి ప్రయత్నం జరుగుతున్నదని ఆయన ఆరోపించారు.
రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలని, ఏ ఒక్క రైతు నష్టపోకుండా పంట ఉత్పత్తులను ప్రభుత్వమే కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలన్నారు. ఉమ్మడి జిల్లాలో మార్కెట్ అధికారులు, వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యదర్శులు, ట్రేడర్స్, సిండికేట్ అయిన వారిపై ప్రత్యేక దృష్టి పెట్టి తప్పు చేసిన వారిపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాల్ననారు. మిర్చి ట్రేడర్స్ నాణ్యత లేదని సాకులు చెపుతూ, కొనుగోళ్లు జాప్యం చేయడం వల్ల యార్డులో మిర్చి నిల్వలు పెరిగిపోయి రైతులకు రైతులకు తీవ్ర నష్టం కలుగుతుందన్నారు. ప్రభుత్వమే ఆ పంటను కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని పేర్కొన్నారు. .ఈ కార్యక్రమంలో LHPS రాష్ట్ర ఉపాధ్యక్షుడు పంతుల్య నాయక్, లంబాడి సంఘాల JAC నాయకులు బర్మావత్ హర్యా నాయక్, బానోత్ గోబ్రియా నాయక్, గుగులోత్ బాలు, LHPS జిల్లా ప్రధాన కార్యదర్శి కుశాల్ నాయక్, జిల్లా నాయకులు బానోత్ వీరన్న నాయక్, కొర్రా చందు నాయక్, గుగులోత్ శ్రీను నాయక్, కేళోత్ గోప్లా, హత్తిరాం నాయక్ పాల్గొన్నారు.