కొత్తగూడెం అర్బన్, మే 09 : పాక్ ఉగ్రవాదులను తుదముట్టించేందుకు త్రివిధ దళాలు వీరోచితంగా యుద్ధం చేస్తున్నాయని కొత్తగూడెం జర్నలిస్టు జేఏసీ నాయకులు అన్నారు. శుక్రవారం కొత్తగూడెం పట్టణంలో జర్నలిస్టు జేఏసీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ.. ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్తాన్కు ప్రపంచ దేశాలు మద్దతు ఇవ్వవద్దని కోరారు. శాంతి సామరస్యంతో జీవిస్తున్న భారతదేశ ప్రజల్లో అలజడి రేపి విచ్ఛిన్నం చేయాలనుకున్న ఉగ్రవాదులకు సరైన సమాధానం చెప్పేందుకు ప్రజలు ఈ సమయంలో ఒక్కటిగా ఉండాలని పిలుపునిచ్చారు.
ఆర్మీకి ఎప్పటికప్పుడు మద్దతివ్వాలని, ప్రభుత్వం చెప్పే సూచనలను ప్రజలు పాటించాలని కోరారు. ఉగ్రవాదాన్ని తుదముట్టించడమే లక్ష్యంగా త్రివిధ దళాలు పనిచేస్తున్నట్లు తెలిపారు. యుద్ధంలో ప్రతి సైనికుడికి మనోధైర్యాన్ని ప్రసాదించాలని కోరుకుంటూ అండగా ఉందామని పేర్కొన్నారు.