కొత్తగూడెం అర్బన్, సెప్టెంబర్ 26 : కేంద్ర జల శక్తి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో అమలవుతున్న జల్ సంచాయ్, జన్ భాగిదారీలో – 1.0 కార్యక్రమంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు గుర్తింపు వచ్చిందని, దేశ వ్యాప్తంగా వర్షపు నీటి సంరక్షణ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్రం అగ్రస్థానంలో నిలవడం ఈ జిల్లాలో చేపట్టిన చర్యల ఫలితంగా రూ.25 లక్షల ప్రత్యేక నగదు బహుమతి పొందడం గర్వించదగిన విషయమని కలెక్టర్ జితేష్.వి.పాటిల్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో 32 వేల నీటి సంరక్షణ పనులు చేపట్టి 23,103 పనులను పూర్తి చేశామని, ఇంకుడు గుంతలు, నీటి కుంటలు, రూఫ్ వాటర్ హార్వెస్టింగ్, ఊట చెరువులు వంటి వర్షపు నీటి సంరక్షణ పనులను గ్రామీణ, పట్టణ ప్రాంతాలలో ప్రజలకు ఉపయోగ పడుతున్నాయన్నారు.
ఉపాధి హామీ పనులు, పంట నీటి కుంటలు వంటి కార్యక్రమాలలో నీటి సంరక్షణకు ప్రాధాన్యత ఇవ్వడం వల్లే ఇది సాధ్యమైందన్నారు. జిల్లా ప్రజల సహకారం, స్థానిక సంస్థల భాగస్వామ్య, గ్రామీణ అభివృద్ధి సంస్థల కృషి వల్ల ఈ విజయాన్ని సాధించగలిగామని తెలిపారు. భూగర్భ జలాల నిల్వ పెంపు, పంటల ఉత్పాదకతలో స్థిరత్వం సాధించడంలో ఇది ఎంతగానో దోహదపడిందని పేర్కొన్నారు. భవిష్యత్లో విస్తృతంగా వర్షపు నీటి సంరక్షణ పనులను కొనసాగించి జిల్లాను దేశంలోనే ఆదర్శంగా నిలిచేలా చర్యలు తీసుకుంటామని కలెక్టర్ ధీమా వ్యక్తం చేశారు.