కొత్తగూడెం అర్బన్, జూన్ 13 : కొత్తగూడెం కార్పొరేషన్ వల్ల గ్రామీణ ప్రాంతాలకు వర్తించే పథకాలు, హక్కులను అక్కడి ప్రజలు కోల్పోతారని, దీంతో వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారని సీపీఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సహాయ కార్యదర్శి గౌని నాగేశ్వరరావు అన్నారు. శుక్రవారం బస్టాండ్ సెంటర్లోని ఐఎఫ్టీయూ కార్యాలయంలో జరిగిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. కొత్తగూడెం కార్పొరేషన్లో 60 డివిజన్లు ఏర్పాటు చేస్తూ ముసాయిదా విడుదల చేశారని, సుజాతనగర్లోని ఏడు గ్రామ పంచాయతీలను కార్పొరేషన్లో విలీనం చేసినట్లు తెలిపారు. దీనివల్ల అక్కడ ఉన్నటువంటి ఆదివాసి, గిరిజన, వెనుకబడిన ప్రజలు తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
కార్పొరేషన్లో విలీనం వల్ల రియల్ ఎస్టేట్ వ్యాపార వర్గాలకు, పెట్టుబడిదారులకు మాత్రమే లాభం చేకూరుతుంది తప్పితే, ప్రజలకి ఎలాంటి ప్రయోజనం లేదన్నారు. కార్పొరేషన్ వల్ల ఏజెన్సీలో హక్కులను, అలవెన్స్లను కోల్పోతారన్నారు. గిరిజనేతరులకు ఎక్కువగా ఉపయోగపడే విధంగా ఈ కార్పొరేషన్ ఉంటుందన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి హామీ పనులు కోల్పోతారన్నారు. కావునా కొత్తగూడెం కార్పొరేషన్ని రద్దు చేసి పాత పద్ధతిలోనే కొనసాగించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎస్కే ఉమర్, కారం వెంకప్ప, మహేశ్, ఆదినారాయణ, నాగేశ్వర్రావు, రమేశ్ పాల్గొన్నారు.