సత్తుపల్లి, ఏప్రిల్ 17 : ఆంధ్రా నుంచి కొందరు వ్యాపారులు నకిలీ ఎరువులు, పురుగుమందులు తయారుచేసి తెలంగాణ రైతులకు అంటగడుతున్నారని, వారిపై పీడీ యాక్టు కేసులు నమోదు చేయాలని ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య అన్నారు. ఆదివారం సత్తుపల్లిలోని క్యా ంపు కార్యాలయంలో విలేకరులతో ఆయన మాట్లాడుతూ సత్తుపల్లి నియోజకవర్గం చుట్టూ ఆంధ్రా సరిహద్దు ఉండటం వల్ల అక్కడి నుంచి నకిలీ ఎరువులు, పురుగుమందుల తయారీదారులు ఈ ప్రాంత వ్యాపారుల సాయంతో రైతులకు అంటగట్టి సొమ్ము చేసుకుంటున్నారని అన్నారు.
గతంలో వేంసూరు, పెనుబల్లి మండలాల్లో కల్తీ యూరియా పట్టుబడిందని, అదే తరహాలో వారం క్రితం సత్తుపల్లి మండలంలో రంగు ఇసుక పేరుతో కల్తీ పొటాష్ అమ్మకాలు కూడా జరగ్గా రైతులే పట్టుకుని ఆ వ్యాపారిని అధికారులకు అప్పగించారని గుర్తుచేశారు. ఈ విషయాన్ని తాను వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, వ్యవసాయశాఖ కార్యదర్శి రఘునందన్, కలెక్టర్ వీపీ గౌతమ్, సీపీ విష్ణు ఎస్ వారియర్ దృష్టికి తీసుకువెళ్లానని వివరించారు. తెలంగాణ, ఆంధ్రా అధికారులు సరిహద్దుల్లో నిఘా పెంచి కల్తీ దందాను అరికట్టాలని కోరారు. సత్తుపల్లి నకిలీ ఎరువుల కుంభకోణంలో నిందితుడైన కృష్ణా జిల్లా తెల్లదేవరపల్లికి చెందిన వ్యక్తిపై అధికారులు ఉదాసీనంగా వ్యవహరించడం వల్లే మళ్లీ కల్తీ బాగోతానికి తెర తీశారన్నారు.
వ్యవసాయ అధికారులు నిర్లక్ష్యం వీడి కల్తీ ఎరువుల అమ్మకాలపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. అక్రమార్కులను పట్టుకోవాలన్నారు. కల్తీ ఎరువులను కట్టడి చేయాలన్నారు. సమావేశంలో గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్మన్ కొత్తూరు ఉమామహేశ్వరరావు, మున్సిపల్ చైర్మన్ కూసంపూడి మహేశ్, ఆత్మ చైర్మన్ శీలపురెడ్డి హరికృష్ణారెడ్డి, జడ్పీటీసీ కూసంపూడి రామారావు, దొడ్డా శంకర్రావు, గాదె సత్యం, చల్లగుళ్ల కృష్ణయ్య, పట్టణ అధ్యక్ష, కార్యదర్శులు రఫీ, అంకమరాజు, అనిల్, పవన్, చాంద్‌పాషా, వీరపనేని బాబి పాల్గొన్నారు.