భద్రాద్రి కొత్తగూడెం, నమస్తే తెలంగాణ/ భద్రాచలం, ఏప్రిల్ 4: జగత్కల్యాణం అంగరంగ వైభవంగా జరిగేలా అధికారులు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ ఆదేశించారు. శ్రీసీతారాములు కల్యాణం కనులారా వీక్షించేందుకు వచ్చిన భక్తులకు కల్యాణ తలంబ్రాలు, లడ్డూ ప్రసాదాలు అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ నెల 10, 11 తేదీల్లో జరిగే శ్రీరామనవమి, మహా పట్టాభిషేకం వేడుకల ఏర్పాట్లపై భద్రాచలం సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఇన్చార్జి సబ్ కలెక్టర్ కర్నాటి వెంకటేశ్వర్లు అధ్యక్షతన సోమవారం జరిగిన అధికారుల సమీక్ష సమావేశంలో మంత్రి మాట్లాడారు. లక్షమందికి పైగా భక్తులొచ్చినా ఎక్కడ అసౌకర్యం కలుగకుండా ఏర్పాట్లు చేయాలని సూచించారు.
ప్రసాదాలు, తలంబ్రాలు ఎక్కడ ఉంటాయో తెలిసేలా, ఏ క్లస్టర్ భక్తులు ఆ క్లస్టర్‌కు వెళ్లేదారి తెలిపేలా సూచిక బోర్డులను ఏర్పాటు చేయాలని సూచించారు. ఆర్టీసీ నుంచి 400 సర్వీసులు నడుపుతున్నందున ఆ బస్సులకు ప్రత్యేక పార్కింగ్ ప్రదేశాన్ని కేటాయించాలన్నారు. ఆలయ అధికారులు, పోలీస్, పంచాయతీ రాజ్, విద్యుత్, రవాణా, గ్రామ పంచాయతీ, ఆర్టీసీ, వైద్యారోగ్య, ఇరిగేషన్, ఫైర్, రెవెన్యూ, ఎండోమెంట్, ఆయా శాఖల అధికారులు తమకు కేటాయించిన విధుల్లో ఎలాంటి లోటుపాట్లూ లేకుండా చూసుకోవాలని ఆదేశించారు. నిర్దేశించిన పనులన్నీ ఈ నెల 8నాటికి పూర్తి కావాలని ఆదేశించారు. అనంతరం స్వామివారి కల్యాణం జరిగే మిథిలా ప్రాంగణాన్ని మంత్రి పువ్వాడ స్వయంగా పరిశీలించి సూచనలు చేశారు. అనంతరం సమాచార పౌరసంబంధాల శాఖ తయారు చేసిన ప్రచార పోస్టర్‌ను ఆవిష్కరించారు.
ఇబ్బందులు ఉండవు: కలెక్టర్
కల్యాణం తిలకించడానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులూ ఉండవని భద్రాద్రి కలెక్టర్ అనుదీప్ అన్నారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని ఈసారి ముందస్తు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. భక్తుల కోసం 24 సెక్టార్లను ఏర్పాటు చేశామని, అందరికీ తలంబ్రాలు అందించేలా ప్రత్యేక కౌంటర్లు అందుబాటులో ఉంచామని అన్నారు. హెలీఫ్యాడ్లను సైతం అందుబాటులో ఉంచామన్నారు. గోదావరిలో ప్రమాదాలు జరుగకుండా స్విమ్మర్లు, కంట్రీ బోట్లను అందుబాటులో ఉంచుతామన్నారు. ప్రభుత్వ విప్ రేగా కాంతారావు, ఐటీడీఏ పీవో పోట్రు గౌతమ్, అదనపు ఎస్పీ కేఆర్కే ప్రసాద్, సబ్ కలెక్టర్ వెంకటేశ్వర్లు, ఆలయ ఈవో శివాజీ, అన్ని శాఖల అధికారులు పాల్గొన్నారు.