భద్రాచలం, ఏప్రిల్ 2: భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామివారి దేవస్థానంలో వసంతపక్ష తిరు కల్యాణ బ్రహ్మోత్సవాలు శనివారం సంప్రదాయబద్ధంగా ప్రారంభమయ్యాయి. శ్రీశుభకృత్ నామ సంవత్సర ఉగాదిని పురస్కరించుకొని ఉదయం అంతరాలయంలోని మూలవరులకు పంచామృతాలతో అభిషేకం చేశారు. బ్రహ్మోత్సవాల తొలి రోజున ఉత్సవమూర్తులు, నిత్య కల్యాణమూర్తులకు అభిషేకం నిర్వహించారు. ఉగాది పర్వదినం సందర్భంగా భక్తులకు వేప పూత ప్రసాదం పంపిణీ చేశారు. సాయంత్రం వేద పండితుడు చెన్నావఝల వెంకటేశ్వర అవధాని.. శుభకృత్ నామ సంవత్సరం నూతన పంచాంగ శ్రవణం వినిపించారు. రామయ్య ఆదాయం 5, వ్యయం 5, సీతమ్మ ఆదాయం 11, వ్యయం 5గా ఉన్నట్లు వివరించారు. దేశంలో రాజకీయ అనిశ్చిత నెలకొంటుందని, వర్షాలు తక్కువగా కురుస్తాయని వివరించారు.
భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామివారి దేవస్థానంలో శనివారం వసంతపక్ష తిరు కల్యాణ బ్రహ్మోత్సవాలు సంప్రదాయబద్ధంగా ప్రారంభమయ్యాయి. శుభకృత్ నామ సంవత్సర ఉగాదిని పురస్కరించుకొని ఉదయం అంతరాలయంలోని మూలవరులకు పంచామృతాలతో అభిషేకం జరిపారు. బ్రహ్మోత్సవాల తొలిరోజున ఆలయంలో వేప పూత ప్రసాదం (ఉగాది పచ్చడి) భక్తులకు పంపిణీ చేశారు. ఉత్సవమూర్తులు, నిత్యకల్యాణమూర్తులు, లక్ష్మీ తాయారు అమ్మవారు, భక్త రామదాసు, ఆండాళ్ తల్లికి.. ఉత్సవారంభ స్నపనం నిర్వహించారు. శనివారం బ్రహ్మోత్సవాలు ప్రారంభం కాగా ఈ నెల 6 నుంచి నవాహ్నిక మహోత్సవాలను ప్రారంభిస్తారు. 10న మిథిలా ప్రాంగణంలో అంగరంగ వైభవంగా శ్రీసీతారామ స్వామివారి కల్యాణాన్ని, 11న మహా పట్టాభిషేకాన్ని నిర్వహించనున్నారు.
రేపటి నుంచి ఆన్లైన్లో రూములు
భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామివారి దేవస్థానం ఆధ్వర్యంలో ఏప్రిల్ 10న శ్రీరామనవమి, 11న మహా పట్టాభిషేకం నిర్వహించనున్నారు. ఈ ఉత్సవాలను వీక్షించేందుకు భద్రాచలానికి వచ్చే భక్తులు ఏప్రిల్ 4 నుంచి లాడ్జీల్లో రూములను ఆన్లైన్ ద్వారా బుక్ చేసుకోవచ్చని సబ్ కలెక్టర్ కర్నాటి వెంకటేశ్వర్లు శనివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. www.bha drachalam online.com ద్వారా సోమవారం నుంచి ఈ సౌకర్యం అందుబాటులోకి రానుందని చెప్పారు.
పర్ణశాల ఆలయంలో..
పర్ణశాల, ఏప్రిల్ 2: ప్రముఖ పుణ్యక్షేత్రమైన పర్ణశాల ఆలయంలో శనివారం శుభకృత్ నామ ఉగాది సంవత్సర పంచాంగ శ్రవణాన్ని అర్చకులు వైభవంగా నిర్వహించారు. ఉగాది పర్వదినం సందర్భంగా ఆలయంలో శనివారం ఉదయం నుంచి మూలవిరాట్లు, ఉత్సవమూర్తులకు నూతన వస్ర్తాలంకరణ చేసి ప్రత్యేక పూజా కార్యక్రమాలు, అభిషేకాలు నిర్వహించారు. సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అర్చకులు భక్తులకు ఉగాది పచ్చడిని తీర్థ ప్రసాదంగా అందజేశారు. సాయంత్రం 6 గంటలకు పర్ణశాల సీతారామచంద్రస్వామివార్లకు తిరువీధి సేవ నిర్వహించి ఆలయ ప్రాంగణంలో ఉగాది పంచాంగ శ్రవణ కార్యక్రమం నిర్వహించారు. అర్చకులు శుభ కృత్ నామ ఉగాది ఎంతో శుభాలను కలిగిస్తుందని, ఈ ఏడాది తెలంగాణ రాష్ట్రం అభివృద్ధితోపాటు ప్రజలు సుఖసంతోషాలతో ఉంటారని తెలిపారు. అర్చకులు కిరణ్‌కుమారాచార్యులు, భార్గవాచార్యులు, సూపరింటెండెంట్ కిశోర్, ప్రసాద్, రాము, శివ పాల్గొన్నారు.
ఈ సారి దేశంలో రాజకీయ అనిశ్చితి
దేశంలో ఈ ఏడాది రాజకీయ అనిశ్చితి నెలకొంటుందని వేద పండితుడు చెన్నావఝల వేంకటేశ్వర అవధాని పేర్కొన్నారు. శ్రీశుభకృత్ నామ సంవత్సర ఉగాది సందర్భంగా భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామివారి దేవస్థానంలో శనివారం సాయంత్రం ఆయన పంచాగ శ్రవణం చేశారు. భద్రాద్రి రామయ్య ఆదాయం 5, వ్యయం 5గా, సీతమ్మ ఆదాయం 11, వ్యయం 5గా ఉందని వివరించారు. ఈ ఏడాది వర్షాలు 10వ వంతు సముద్రంలో, 7వ వంతు పర్వతాలపై, 2 వంతు భూమిపై కురుస్తాయని, అందువల్ల పంటలు తక్కువగా పండుతాయని వివరించారు. దేశంలో రాజకీయ అనిశ్చతి నెలకొంటుందని చెప్పారు.
ఉగాది పర్వదినం.. శనివారం రోజున రావడంతో శని.. రాజుగా ఉంటాడని, దీనివల్ల అగ్ని ప్రమాదాలు ఎక్కువగా జరుగుతాయని అన్నారు. ఈ నెల 13 నుంచి 24 వరకూ ప్రాణహిత పుష్కరాలు జరుగుతాయన్నారు. ఈ ఏడాది రెండు గ్రహణాలు సంభవిస్తాయని, అక్టోబర్ 25న సూర్య గ్రహణం, నవంబర్ 8న చంద్రగ్రహణం వస్తాయని చెప్పారు. మే 4న కర్తరి, మే 11న నిజ కర్తరి ప్రారంభమవుతుందని చెప్పారు. శుక్ర మౌడ్యమి సెప్టెంబర్ 18 నుంచి నవంబర్ 27 వరకు ఉంటుందని పేర్కొన్నారు. దేవస్థానం ఏఈవో శ్రావణ్‌కుమార్ దంపతులు, భద్రాచలం ప్రథమశ్రేణి న్యాయమూర్తి సురేశ్ దంపతులు, ఆలయ ప్రధానార్చకులు పొడిచేటి సీతారామానుజాచార్యులు, అమరవాది విజయరాఘవన్, వేద పండితులు ఎస్టీజీ కృష్ణమాచార్యులు, సన్యాసిశర్మ పాల్గొన్నారు.