కోర్టుల్లో మౌలిక సదుపాయాలు ఉండాలి..
హైకోర్టు జడ్జీలు వెంకటేశ్వరరెడ్డి, వినోద్‌కుమార్, రాజశేఖర్‌రెడ్డి
ఖమ్మంలో జిల్లా అదనపు ఫాస్ట్‌ట్రాక్ కోర్టు, జిమ్ ప్రారంభోత్సవం
ఖమ్మం లీగల్, మార్చి 20 : ఖమ్మం జిల్లా అదనపు ఫాస్ట్‌ట్రాక్ కోర్టు, జిమ్‌ను హైకోర్టు జడ్జీలు ఏ.వెంకటేశ్వరరెడ్డి, టి.వినోద్‌కుమార్, ఏ.రాజశేఖర్‌రెడ్డి ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కోర్టులను కార్పొరేట్ స్థాయిలో అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. సమస్యలను తమ దృష్టికి తీసుకువస్తే పరిష్కరిస్తామన్నారు. కోర్టులు, పోలీస్ స్టేషన్లంటే భయం పోయేవిధంగా ఫ్రెండ్లీ పోలీసింగ్‌తో పని చేయాలన్నారు. తీర్పులను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో మీడియా ముఖ్యపాత్ర పోషిస్తున్నదని, పోక్సో, మహిళల పట్ల దాడుల విషయంలో సంయమనం పాటించాలని సూచించారు. కోర్టులో జిమ్ ఏర్పాటు చేయడం ఖమ్మంలోనే ప్రథమమని, మిగిలిన జిల్లాలకు ఇది ఆదర్శమని అన్నారు. జిమ్ ఏర్పాటుకు తోడ్పాటునందించిన న్యాయవాది స్వామి రమేశ్‌కుమార్‌ను అభినందించారు.
జిల్లా పరిపాలన న్యాయమూర్తి, హైకోర్టు జడ్జి వినోద్‌కుమార్ మాట్లాడుతూ బార్ అసోసియేషన్ విజ్ఞప్తి మేరకు మౌలిక సదుపాయాలు, అదనపు భవనాలు, న్యాయమూర్తుల ఖాళీలను త్వరలో భర్తీ చేస్తామన్నారు. క్రిమినల్ కేసుల సత్వర పరిష్కారానికి పోలీస్ కమిషనర్ ప్రత్యేక చొరవ తీసుకోవాలని సూచించారు. ఎన్ఎస్పీ క్వార్టర్లో జ్యుడీషియల్ క్వార్టర్ నిర్మాణానికి కృషిచేయాలన్నారు. హైకోర్టు జడ్జీ నవీన్‌రావు మాట్లాడుతూ కేసుల సత్వర పరిష్కారానికి కోర్టుల్లో మౌలిక సదుపాయాలు ఉండాలని, వాటి కోసం కృషిచేస్తామన్నారు. జిల్లా జడ్జి చంద్రశేఖరప్రసాద్ మాట్లాడుతూ జిల్లాలో ఉన్న కోర్టు భవనాలను ఆధునీకరిస్తున్నామని, హైకోర్టు ఆదేశాల మేరకు పెండింగ్ కేసుల పరిష్కారానికి కృషి చేస్తున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమానికి జిల్లా బార్ అధ్యక్షుడు మలీదు నాగేశ్వరరావు అధ్యక్షత వహించారు. హైకోర్టు జడ్జీలను గజమాలతో సత్కరించారు. కార్యక్రమంలో న్యాయమూర్తులు, న్యాయవాదులు, న్యాయశాఖ ఉద్యోగులు పాల్గొన్నారు.