లక్ష్మీదేవిపల్లి, సెప్టెంబర్ 23 : దేశ వ్యాప్తంగా పేరు పొందిన ప్రతిష్ఠాత్మక ‘తిరుచ్చి ర్యాండర్స్ క్లబ్’ ఆధ్వర్యంలో ప్రతి ఏటా నిర్వహించే సైక్లింగ్ పోటీల్లో ఈసారి ఖమ్మం, భద్రాద్రి జిల్లాల నుంచి తొలిసారిగా 8 మంది సైక్లిస్టులు పాల్గొని విశేష విజయాన్ని సాధించారు. ఈ నెల 19, 20, 21 తేదీల్లో జరిగిన పోటీల్లో దేశం నలుమూలల నుంచి 300 మంది సైక్లిస్టులు పోటీ పడగా, ఖమ్మం–భద్రాద్రి ప్రాంతాల యువ సైక్లిస్టులు 600 కిలోమీటర్ల సుదీర్ఘ యాత్రను కేవలం 40 గంటల్లో పూర్తి చేసి విజయకేతనం ఎగురవేశారు. తిరుచ్చి నుంచి ధనుష్కోటి, తిరిగి ధనుష్కోటి నుంచి తిరుచ్చి వరకు సాగిన ఈ కఠినమైన సైక్లింగ్ యాత్రను విజయవంతంగా పూర్తి చేసి, వీరు తమకు లభించిన ‘సూపర్ సైకిల్ ర్యాండర్’ బిరుదులను గెలుచుకున్నారు.
ఈ విజేతలలో ఖమ్మం సైక్లింగ్ క్లబ్‌కు చెందిన కోటేశ్వరరావు, కొలికొండ మహేంద్రకుమార్, వాసిరెడ్డి వాసు, పి.అనుదీప్, జ్యోతిప్రకాశ్, ఎ.నాగరాజు, ఎ.రామారావు, ఆర్.గోపి ఉన్నారు. ఈ సందర్భంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన ఫారెస్ట్ డివిజనల్ ఆఫీసర్ యు.కోటేశ్వరరావు మాట్లాడుతూ మన జిల్లాల సైక్లిస్టులు ఇంత కఠినమైన పోటీలో పాల్గొని విజయవంతమవడం గర్వకారణం. ఈ విజయం ఖమ్మం, భద్రాద్రి జిల్లాల ప్రతిష్ఠను జాతీయ స్థాయిలో నిలబెట్టిందని పేర్కొన్నారు.
Lakshmidevipally : ‘సూపర్ సైకిల్ ర్యాండర్స్’గా ఖమ్మం–భద్రాద్రి సైక్లిస్టులు