జూలూరుపాడు, మార్చి 30 : జూలూరుపాడు మండలం కాకర్ల గ్రామానికి చెందిన కూరాకుల నరేశ్ జాతీయ కబడ్డీ శిక్షకుడిగా (కోచ్‌గా) ఎంపికయ్యాడు. జాతీయ కబడ్డీ శిక్షణ కేంద్రమైన బెంగళూరులోని “స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా” (SAI) లో జరిగిన జాతీయ స్థాయి కబడ్డీ శిక్షణలో ఆయన విజయవంతంగా ఉత్తీర్ణత సాధించి ఈ అర్హతను పొందారు.
జాతీయ స్థాయి కోచ్‌గా ఉత్తీర్ణత సాధించిన నరేశ్‌ను కబడ్డీ అసోసియేషన్ ప్రతినిధులు ఘనంగా సన్మానించారు. జిల్లా కబడ్డీ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర సహాయ కార్యదర్శి కె.స్వాతిముత్యం, రాష్ట్ర కబడ్డీ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్, ఖమ్మం జిల్లా సెక్రటరీ కె.క్రిస్టోఫర్ స్వయంగా నరేశ్‌ను అభినందించి, శాలువాతో సత్కరించారు.
ఈ సందర్భంగా నరేశ్ మాట్లాడుతూ.. తనకు ఎన్.ఐ.ఎస్ (NIS) శిక్షణ తీసుకునేందుకు అద్భుతమైన అవకాశం కల్పించిన తెలంగాణ కబడ్డీ అసోసియేషన్ ప్రెసిడెంట్, సెక్రటరీలకు, అలాగే ఉమ్మడి ఖమ్మం జిల్లా కబడ్డీ సెక్రటరీలకు ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. గ్రామీణ స్థాయి నుండి జాతీయ స్థాయికి ఎదగడంలో తనకు సహకరించిన ప్రతి ఒక్కరికీ పేరుపేరునా ఆయన ధన్యవాదాలు తెలిపారు.