రామవరం, నవంబర్ 28 : మహాత్మ జ్యోతిరావు పూలేకు భారత రత్న ఇవ్వాలని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జాతీయ ఫెలోషిప్ అవార్డు గ్రహీత బరిగెల భూపేశ్ అన్నారు. శుక్రవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రమైన సింగరేణి కార్మిక ప్రాంతం రామవరం పట్టణంలోని అంబేద్కర్ భవన్(మాదిగ సంక్షేమ సంఘం) ఆధ్వర్యంలో మహాత్మ జ్యోతిరావు పూలే వర్ధంతిని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాదిగ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు కొయ్యడ వెంకన్న అధ్యక్షత వహించారు. భూపేశ్ మాట్లాడుతూ..పూలే సత్యశోధక్ సమాజ్ ఏర్పాటు చేసి విద్యను అందించడమే కాక మహిళా హక్కుల కోసం పోరాడినట్లు తెలిపారు. 1954లో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ బిబిసి టీవీ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన గురువులు ముగ్గురు.. గౌతమ బుద్ధుడు, జ్యోతిరావు పూలే, కబీర్ దాస్ అని చెప్పిన విషయాన్ని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో మాదిగ సంక్షేమ సంఘం జిల్లా కార్యదర్శి సామర్ల సమ్మయ్య, జిల్లా నాయకులు కొత్తూరు మదనయ్య, ఆవునూరి సంజీవరావు, బొంకూరి పోషం, కూరగాయల శ్రీను, మాటేటి అంజయ్య, మద్దికుంట గణేష్, కొత్తూరు చుక్కయ్య, నమిల్ల మధు పాల్గొన్నారు.