హైదరాబాద్, మార్చి 8 (నమస్తే తెలంగాణ): గత రెండేండ్లుగా రంజాన్ తోఫా ఇవ్వకుండా పేద ముస్లిం వర్గాలను నిరాశ పరిచిన ప్రభుత్వం బీఆర్ఎస్ ఒత్తిడికి దిగొచ్చింది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటి, రెండో ఏడాది ఎగనామం పెట్టిన ప్రభుత్వం.. మూడో ఏడాది మాత్రం రంజాన్ గిఫ్ట్ ప్యాక్‌లు పంపిణీ చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు ఇటీవలే ఉత్తర్వులు జారీచేసింది. హైదరాబాద్, సికింద్రాబాద్ పరిధిలోని 24 నియోజకవర్గాలతోపాటు రాష్ట్రంలోని మిగిలిన 95 నియోజకవర్గాల్లో గిఫ్ట్ ప్యాక్‌లు అందజేయాలని నిర్ణయించింది.
జీహెచ్ఎంసీలోని పూర్వపు 150 డివిజన్ల పరిధిలోని 300 మసీదులు, 24 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 96, సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు పరిధిలో 16, ఆర్ఫేజ్, షియా, మహ్ద్వీ పరిధిలోని 19 మసీదులతోపాటు మరో 17 రిజర్వ్‌గా కేటాయించారు. అంటే మొత్తంగా 448 మసీదుల్లో ఒక్కోచోట 500 చొప్పున 2,24, 000 మందికి పండుగ గిఫ్ట్‌లు అందజేస్తారు. మిగిలిన 95 నియోజకవర్గాల్లో 367 మసీదుల్లో 91,750 మందికి తోఫాలు పంపిణీ చేస్తారు. ఇప్పటికే నిర్దేశిత ప్రాంతాలకు గిఫ్ట్ ప్యాక్‌లను తరలించామని మైనారిటీ సంక్షేమ శాఖ అధికారులు వెల్లడించారు. తహసీల్దార్ల పర్యవేక్షణలో పంపిణీ చేస్తామని పేర్కొన్నారు.
రంజాన్ గిఫ్ట్ కేటాయింపులో ప్రభు త్వం ఎమ్మెల్యేలపై వివక్ష చూపిందని విమర్శలు వినిపిస్తున్నాయి. ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాలకు ముస్లింల జనాభా ప్రాతిపదికన కనిష్ఠంగా 750, గరిష్ఠంగా 1,500 వరకు రంజాన్ తోఫాలు కేటాయించారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నియోజకవర్గమైన కొడంగల్, డిప్యూటీ సీ ఎం భట్టి విక్రమార్క ప్రాతినిధ్యం వహిస్తున్న మధిరకు అదనంగా ఐదు వేల గిఫ్ట్‌ప్యాక్‌లు కేటాయించారు. మంత్రుల నియోజకవర్గాలకు అదనంగా రెండు వేల చొప్పు న పంపిణీ చేయాలని నిశ్చయించారు. పండుగ కానుకల పంపిణీలోనూ వివక్ష చూపడాన్ని మైనారిటీ సంఘాల బాధ్యులు తప్పుబడుతున్నారు. జనాభా ప్రాతిపదికన కేటాయించకుండా సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రుల నియోజకవర్గాలకు పెద్దపీట వేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నిస్తున్నారు. ఈ విషయంలో ఎమ్మెల్యేలు సైతం అసంతృప్తితో ఉన్నారని తెలుస్తున్నది.
ఈ ఏడాది రంజాన్ మాసం ప్రారంభమైన తర్వాత బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ లీడర్ హరీశ్‌రావుతోపాటు మాజీ మంత్రులు, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీ లు, ముఖ్యనేతలు ప్రభుత్వం రంజాన్ గిఫ్ట్ ప్యాక్‌లు ఎందుకు పంపిణీ చేయడంలేదని అనేక సందర్భాల్లో ప్రశ్నించారు. ఇఫ్తార్ విందులకు హాజరైన సందర్భాల్లో సర్కార్ తీరును ఎత్తిచూపారు. బీఆర్ఎస్ ఒత్తిడి ఫలితంగానే ప్రభుత్వం రంజాన్ తోఫాలు పం పిణీ చేయాలని నిర్ణయించిందని ముస్లిం మైనారిటీ వర్గాల్లో చర్చ జరుగుతున్నది.
ప్రభుత్వం ముస్లిం మైనారిటీలకు రంజాన్ గిఫ్ట్ ప్యాక్‌లో భాగంగా చీర, జాకెట్, పంజాబీ డ్రెస్, లాల్చీ, పైజామాతో ప్యాక్ చేశారు. గిఫ్ట్ప్యాక్పై కేవలం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఫొటోనే ముద్రించారు. మైనారిటీ అభివృద్ధి, సంక్షేమ శాఖ మంత్రి అజారుద్దీన్ ఫొటోను విస్మరించారు. దీనిపై ముస్లింవర్గాల్లో విమర్శలు వ్యక్తమవుతున్నాయి. తమది ప్రజాపాలన అని, క్యాబినెట్లో మంత్రులందరికీ సమానగౌరవం ఉంటుందని చెప్తున్న కాంగ్రెస్ పార్టీ గిఫ్ట్‌ప్యాక్ కవర్‌పై మైనారిటీ శాఖ మంత్రి ఫొటో లేకుండానే రూపొందించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నిస్తున్నారు.