కొత్తగూడెం అర్బన్, జులై 3 : కార్మికులు పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలను తుంగలో తొక్కి ప్రధాని మోదీ కార్పొరేట్ కంపెనీల వత్తాసు పలుకుతున్నారని ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు కంచర్ల జమాలయ్య విమర్శించారు. 44 కార్మిక చట్టాలలో 29 కార్మిక చట్టాలను రద్దు చేసిందని మండిపడ్డారు. కార్మికుల హక్కులను కేంద్రం హరిస్తోందని దీనిని నిరసిస్తూ ఈ నెల 9న చేపట్టనున్న దేశ వ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని కోరుతూ గురువారం ముందస్తుగా మున్సిపల్ కార్పొరేషన్ మేనేజర్ రవిప్రసాద్కు సమ్మె నోటీసును అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్రప్రభుత్వం ప్రజా, రైతు వ్యతిరేక విధానాలతో 147 కోట్ల మందికి నష్టం జరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు.
ఈ నెల 9న జరుగు ఒక్కరోజు సమ్మె శాంతియుతంగా ఎలాంటి అవాంచనీయ సంఘటనలకు అవకాశం లేకుండా సమ్మెలో అన్ని వర్గాల ప్రజలు పాల్గొనాలని పిలుపునిచ్చారు. మున్సిపల్ కాంట్రాక్టు ఉద్యోగులు, కార్మికులు కూడా పాల్గొనేందుకు అధికారులు సహకరించాలని సూచించారు. కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి గెద్ధాడి నగేష్, మున్సిపల్ కాంట్రాక్టు ఉద్యోగులు మేకల సంపత్, ఇమ్రాన్, శ్రీనాథ్, సంతోష్, గాయత్రి, స్వప్న, మంజుల, ధరణి తదితరులు పాల్గొన్నారు.