ఇల్లెందు, అక్టోబర్ 2 : గెలిచిన సంఘాలు కొనసాగితే ప్రైవేటీకరణ ఖాయమని టీజీబీకేఎస్ ఇల్లెందు ఏరియా ఉపాధ్యక్షుడు జాఫర్ హుస్సేన్ అన్నారు. శుక్రవారం ఇల్లెందు ఏరియా కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. కేసీఆర్ పది సంవత్సరాలుగా సింగరేణిని కేంద్ర ప్రభుత్వ కబంధహస్తాల నుండి కాపాడారన్నారు. సస్యశ్యామలంగా ఉన్న సింగరేణి సంస్థను ఇప్పుడున్న రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి తలొగ్గి ప్రైవేటీకరణ దిశగా తీసుకొని పోతున్నారని, ఉద్యోగుల్లో ఆందోళన మొదలైందన్నారు.
బీఆర్ఎస్ ప్రభుత్వంలో హక్కుల విషయంలో అడగకముందే ఇచ్చేవారని, కారుణ్య నియామకాలు ద్వారా 20వేల ఉద్యోగాలు పొందారని గుర్తు చేశారు. కానీ ప్రస్తుత ప్రభుత్వం ఉద్యోగులు ఎక్కువ మంది ఉన్నారని కుంటి సాకుతో సంవత్సర కాలం నుండి కుట్ర పన్నుతున్నారని, కార్మికుడికి బదులుగా వారసులను తీసుకుంటున్నారు తప్ప కొత్తగా తీసుకోవడం లేదని ఆరోపించారు.
ఇంతకుముందు సింగరేణిలో యజమాన్యానికి భయపడే కార్మికులు, రాష్ట్ర ప్రభుత్వానికి, సింగరేణి యాజమాన్యానికి, తొత్తులుగా మారిన సంఘాలతో భయపడుతున్నారని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. కార్మికుల పక్షాన నిలబడి హక్కులను సాధించిన చరిత్ర టీజీబీకేఎస్దేనన్నారు. సింగరేణికి బకాయి పడ్డ 60వేల కోట్లను విడుదల చేసి వాస్తవ లాభాలను ప్రకటించి 36% వాటాను వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేశారు.