– సమ్మెకు సైతం సిద్ధం
– కాంట్రాక్టు కార్మిక సంఘాల జేఏసీ
బూర్గంపహాడ్, ఏప్రిల్ 07 : కాంట్రాక్టు కార్మికులు తమ సమస్యల సాధన కోసం చేపట్టిన నిరసన రిలే దీక్షలను ఐటీసీ యాజమాన్యం పట్టించు కోవడం లేదని, రానున్న రోజుల్లో సమ్మెబాట పట్టి తమ హక్కులు, సమస్యలకు పరిష్కరాలు సాధించుకుంటామని కాంట్రాక్టు కార్మిక సంఘాల జేఏసీ కన్వీనర్ పాటి సోమిరెడ్డి, కో-కన్వీనర్లు సానికొమ్ము రామచంద్రారెడ్డి, బల్లెం నాగయ్య, ఎండీ యాకూబ్‌పాషా అన్నారు. మంగళవారం రిలే నిరాహార దీక్షలు 13వ రోజుకు చేరుకోవడంతో దీక్షలకు బీఆర్ఎస్ నాయకులు, ఉద్యమకారుడు పొడియం నరేందర్‌తో పాటు జేఏసీ సభ్యులు కందాల వెంకటరెడ్డి, చుక్కపల్లి బాలాజీ, జాన్సన్, సుంకిరెడ్డి వెంకటరెడ్డి సంఘీభావం తెలిపి కార్మికుల సమస్యలు సాధించేంత వరకు వారికి అండగా ఉంటామన్నారు.
జేఏసీ సభ్యులు నర్సింహారావు, యలం కుమార్, బార్ల వెంకటేశ్వర్లు, సందీప్ దీక్షల్లో కూర్చోగా వారికి పూలమాల వేసి దీక్షలను ప్రారంభించారు. ఈ సందర్భంగా జేఏసీ బాధ్యులు మాట్లాడుతూ 13 రోజులు కావస్తున్నా ఐటీసీ యాజమాన్యం కార్మికుల ఇబ్బందులను గుర్తించడం లేదన్నారు. వారి సమస్యలను గాలి కొదిలేస్తుందని, రానున్న రోజుల్లో నిరసన దీక్షలు మరింత ఉధృతం చేయడంతో పాటు అవసరమైతే సమ్మెకు సైతం దిగుతామని హెచ్చరించారు. సమ్మె చేసైనా హక్కులను సాధించి సమస్యలు పరిష్కరించేలా యాజమాన్యంపై ఒత్తిడి తెస్తామన్నారు. ఇప్పటికైనా ఐటీసీ యాజమాన్యం కాంట్రాక్టు సమస్యలపై చర్చలకు పిలవాలని, లేదంటే పోరాటం మరింత ఉధృతం చేస్తామని వారు హెచ్చరించారు. ఈ దీక్షల్లో కాంట్రాక్టు కార్మికులు, జేఏసీ సభ్యులు పాల్గొన్నారు.