– ఉన్నతాధికారుల గైర్హాజరుపై వార్డు సభ్యుల నిలదీత
– పలు శాఖల అధికారులకు నోటీసులు జారీ చేయాలని పాలకవర్గ సభ్యుల డిమాండ్
భద్రాచలం, ఏప్రిల్ 02 : భద్రాచలంలో పలు వార్డుల్లో తమకు ప్రభుత్వ పథకాలు సక్రమంగా అందడం లేదని, దీనికి ప్రజా ప్రతినిదులు సమాధానం చెప్పాలని గ్రామ ప్రజలు గ్రామ సభలో అధికారులను నిలదీశారు. గురువారం భద్రాచలం మేజరు గ్రామ పంచాయతీ కార్యాలయంలో గ్రామ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ శాఖలకు సంబంధించిన ఉన్నతాధికారులు హాజరు కాకుండా మొక్కుబడిగా కిందిస్థాయి సిబ్బందిని పంపడంపై గ్రామ పంచాయతీ పాలకవర్గ సభ్యులు అధికారులను నిలదీశారు. గ్రామ ప్రజలకు ముఖ్యమైన తమ సమస్యలను చెప్పుకునేందుకు వచ్చే వారికి మీరిచ్చే గౌరవం ఇదేనా అంటూ నిలదీశారు. అలాగే గ్రామ సభలో ఇందిరమ్మ ఇళ్ల మంజూరీలో జాప్యం చోటు చేసుకోవడంపై గృహ నిర్మాణ శాఖ ఏఈని గ్రామస్తులు ప్రశ్నించారు. ఈ విషయంపై ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తానని అన్నారు.
అలాగే సుభాష్‌నగర్, గొల్లబజారుతో పాటు పలు కాలనీల్లో ఇందిరమ్మ ఇళ్లకు వాణిజ్య విద్యుత్తు కనెక్షన్లు ఇస్తున్నారని ఇలా ఎందుకిస్తున్నారని బీఆర్ఎస్ వార్డు సభ్యుడు కాపుల గోపి ప్రశ్నించారు. ఈ విషయమై విద్యుత్ శాఖ అధికారులు మాట్లాడుతూ కిందిస్థాయి సిబ్బందికి అవగాహన లేక ఇలాంటి పొరపాటు జరుగుతుందని, ఈ సమస్యను పరిష్కరిస్తామని పేర్కొన్నారు. బహుళ అంతస్తుల నిర్మాణాల విషయంలో కఠినంగా వ్యవహరించాల్సిన గ్రామ పంచాయతీ అధికారులు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారని గతంలో బహుళ అంతస్తుల నిర్మాణ సమయంలో ఇద్దరు కార్మికులు మృతి చెందారని ఆదివాసీ నాయకులు ముర్ల రమేష్, పూనెం ప్రదీప్‌లు పేర్కొనగా పంచాయతీ కార్యదర్శి శ్రీనివాస్ మాట్లాడుతూ పాలకవర్గం, ఉన్నతాధికారుల దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్తానని తెలిపారు.
అలాగే పట్టణంలో పారిశుధ్యం, పెన్షన్లు, ఇతర సమస్యలపై ప్రజలు వినతి పత్రాలను అందజేశారు. ఇదిలా ఉండగా కొన్ని శాఖలకు చెందిన బాధ్యులు గ్రామ సభకు హాజరు కాకపోవడంపై నోటీసులు అందజేస్తామని గ్రామ సర్పంచ్ పూనెం కృష్ణ తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ పూనెం కృష్ణ, పాలకవర్గ సభ్యులు కావూరి గోపి, బండారు శరత్, అబ్బినేని వినీల, ఇన్చార్జి ఎంపీడీఓ, పంచాయతీ కార్యదర్శి శ్రీనివాస్, ఎస్ఐ సతీష్, అధికారులు పాల్గొన్నారు.