– ప్రజావాణిలో మాజీ ఉప సర్పంచ్ ఫిర్యాదు
బూర్గంపహాడ్, మార్చి 23 : బూర్గంపహాడ్ మండల కేంద్రంలో మేజర్ పంచాయతీగా ఉన్న బూర్గంపహాడ్ పంచాయతీలో నిధుల వినియోగంలో అక్రమాలు జరిగాయంటూ సోమవారం కలెక్టరేట్లో జరిగిన ప్రజావాణిలో మాజీ ఉప సర్పంచ్ చిప్పా సుధాకర్ కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. గత సర్పంచుల పదవీకాలం ముగిసిన తర్వాత, పంచాయతీ పాలన ప్రత్యేక అధికారుల చేతుల్లోకి వెళ్లిన సమయాన్ని ఆసరా చేసుకుని పంచాయతీ కార్యదర్శి భారీగా నిధులు ఖర్చు చేసినట్లు రికార్డుల్లో చూపించారని ఆరోపించారు. గ్రామ పంచాయతీలో ఎలాంటి అభివృద్ధి జరగకపోయినా జరిగినట్లుగా చూపి లక్షల రూపాయల నిధులు ఖర్చు చేశారని, నిబంధనల ప్రకారం ఉండాల్సిన ఎంబీ రికార్డులు లేకుండానే లక్షల రూపాయలు బకాయి ఉన్నట్లు రికార్డుల్లో చూపించడం వెనుక పెద్ద కుంభకోణం దాగి ఉందని ఫిర్యాదులో పేర్కొన్నారు.
ఈ ఫిర్యాదును స్వీకరించిన కలెక్టర్ తక్షణమే స్పందించి అక్రమాలపై సమగ్ర విచారణ జరపాలని జిల్లా పంచాయతీ అధికారిని ఆదేశించారు. పంచాయతీ నిధుల వినియోగంలో అక్రమాలు జరిగినట్లు తేలితే బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. రికార్డులు లేకుండా ఇష్టానుసారంగా నిధులు ఖర్చు చేయడం చట్టవిరుద్ధమని, దీనిపై పూర్తిస్థాయి విచారణ జరిపి వాస్తవాలు బయటపెట్టాలని మాజీ ఉప సర్పంచ్ కలెక్టర్ ను కోరారు. కలెక్టర్ ఆదేశాల మేరకు విచారణ జరిగితే పంచాయతీ నిధుల గోల్మాల్ వ్యవహారంపై మరింత స్పష్టత వస్తుందని పలువురు చర్చించుకుంటున్నారు.