రామవరం, మే 19 : ప్రధాన కూడలిలో జరుగుతున్న ప్రమాదాల నివారించేందుకు సింగరేణి కొత్తగూడెం ఏరియా అధికారులు నడుం బిగించారు. ఇటీవల కాలంలో విజయవాడ జగదల్పూర్ (30) జాతీయ రహదారి రుద్రంపూర్ ప్రగతివనం వద్ద నుండి రామవరం 14 నంబర్ వరకు తరచుగా ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ ప్రమాదాల్లో పలువురు మృతి చెందడం, మరికొందరు క్షతగాత్రులు అవుతున్నారు. ఈ నేపథ్యంలో యూనియన్ నాయకులు, కార్మికులు, ప్రభావిత ప్రాంత ప్రజల అభ్యర్థన మేరకు సింగరేణి కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ శాలెం రాజు ఆదేశాలతో ఏరియా వర్క్‌షాప్ డీవైజీఎం ఈఅండ్ఎంటీ .శ్రీకాంత్ ఆధ్వర్యంలో జాతీయ రహదారిపై 5 టవర్లు ఏర్పాటు చేయనున్నారు.
ఒక్కొక్క టవర్ రూ.2 లక్షల వ్యయం కానున్నది. సుమారు రూ.10 లక్షల వ్యయంతో ఐదు టవర్లు, ఒక్కొక్కటి 10 మీటర్ల ఎత్తు, 200 వాట్స్, 3 ఎల్ఈడీ లైట్లు ఏర్పాటు చేయనున్నారు. అందులో భాగంగా ముందుగా రైల్వే బ్రిడ్జి వద్ద వద్ద ఉన్న కూడలిలో లైటింగ్ టవర్ ఏర్పాటు చేశారు. త్వరలోనే పాలిటెక్నిక్, 3 ఇంక్లైన్ బంగ్లోస్, బేరియం తండా, కోల్డ్ టెస్టింగ్, టూ టౌన్ పోలీస్ స్టేషన్ వద్ద ఏర్పాటు చేయనున్నారు. ఈ చర్యపై వాహనదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా మాత శిశు ఆరోగ్య కేంద్రం వద్ద కూడా లైటింగ్ టవర్ ఏర్పాటు చేస్తే బాగుంటుందని స్థానికులు జీఎంను కోరుతున్నారు.