– ప్రజావాణిలో సీపీఎం నాయకుల ఫిర్యాదు
బూర్గంపహాడ్, సెప్టెంబర్ 28 : అర్హులైన పేదలకు రెండవ విడతలో ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలని, పెండింగ్ బిల్లులు వెంటనే విడుదల చేయాలని సీపీఎం బూర్గంపహాడ్ మండల కార్యదర్శి బత్తుల వెంకటేశ్వర్లు అన్నారు. బృందం సభ్యులతో కలిసి ఎంపీడీవో కార్యాలయంలో జరిగిన ప్రజావాణిలో ఎంపీడీవో జమలారెడ్డికి సోమవారం ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా బత్తుల మాట్లాడుతూ.. అర్హులైన నిరుపేదలందరికీ రాజకీయాలకతీతంగా ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలన్నారు. పెండింగ్ బిల్లులు తక్షణమే విడుదల చేసి లబ్దిదారులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. సారపాక-బూర్గంపహాడ్ మధ్య జాతీయ రహదారి గోతులతో నరకప్రాయంగా మారిందని, ఈ రహదారిపై ప్రయాణం వాహనదారులకు ఇబ్బందికరంగా ఉందన్నారు. కల్యాణలక్ష్మి పెండింగ్ బిల్లులు, చేయూత కొత్త పింఛన్లు మంజూరు చేయాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఎం నాయకులు బి.రాము, కె.ప్రతాప్ పాల్గొన్నారు.