రామవరం, జూన్ 12 : ఆహార భద్రత కార్డు (రేషన్ కార్డు) అర్హత మంజూరు ఆదాయ పరిమితి నిబంధన రూ.2 లక్షల నుండి రూ.3 లక్షలకి పెంచి పేద, మధ్య తరగతి ప్రజలకు రేషన్ కార్డులు మంజూరు చేయాలని మున్సిపల్ మాజీ ఫ్లోర్ లీడర్ మునిగడప వెంకటేశ్వర్లు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. గురువారం నేతాజీ బస్తీలో జరిగిన సిపిఐ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. 10 సంవత్సరాల తర్వాత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆహార భద్రత (రేషన్) కార్డుల మంజూరులో ఆదాయ పరిమితి రూ.2 లక్షలు దాటిన వారికి రేషన్ కార్డులు అందని ద్రాక్షగా మారుతున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. సింగరేణి కార్మికుల పెన్షన్ లేదా ఒక ప్రైవేటు కార్మికుడి వేతనాన్ని పరిగణలోకి తీసుకుని రూ.2 లక్షలు ఆదాయం దాటితే రేషన్ కార్డులు మంజూరు చేయడం లేదని, ఇది సరికాదన్నారు.
నిలకడ లేని ప్రైవేట్ కార్మికుల వేతనాన్ని పరిగణలోకి తీసుకోవడం సరికాదన్నారు. ఆదాయంలో ఖర్చులు పోను మిగిలిన దాన్నే ఆదాయంగా తీసుకోవాలే తప్ప వచ్చిన మొత్తాన్ని ఆదాయంగా తీసుకోవడం సరికాదన్నారు. ప్రభుత్వ పథకాలకు ఆదాయ పరిమితులు పెంచాల్సిన అవసరం ఉందన్నారు. ఒకవైపు కేంద్ర ప్రభుత్వం ఆదాయ పరిమితిని రూ.5 లక్షలకు పెంచినప్పుడు, రాష్ట్ర ప్రభుత్వాలు ఎందుకు పెంచడం లేదని ఆయన ప్రశ్నించారు. ఎంతోకాలంగా గ్రామీణ ప్రాంతాలకి లక్షన్నర, పట్టణ ప్రాంతాలకు రెండు లక్షల రూపాయల ఆదాయ పరిమితి కొనసాగించడం సరికాదని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ మహిళ నాయకురాలు ముద్ద మార్తమ్మ, నాయకులు సబ్బని పాపారావు, జిట్టా నవీన్, దేవాపుత్రరాజమని, ముంతాజ్ ,కోటేశ్వరి, రాధా ,అబ్బాస్ పాల్గొన్నారు.