Bhadadri Kothagudem | టేకులపల్లి, డిసెంబర్ 5: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలంలో ఎమ్మెల్యే తమ్ముడు రెచ్చిపోయాడు. నామినేషన్ వేయవద్దని బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థిపై దాడికి దిగాడు. చుక్కలబోడు నామినేషన్ కేంద్రంలో శుక్రవారం ఈ ఘటన చోటు చేసుకుంది.
టేకులపల్లి మండలంలోని కోయగూడెం పంచాయతీ సర్పంచ్ పదవి కోసం పూనెం కరుణాకర్‌ను బీఆర్ఎస్ బలపరిచింది. శుక్రవారం నాడు కరుణాకర్ నామినేషన్ వేసేందుకు వెళ్లగా ఇల్లెందు ఎమ్మెల్యే కోరం కనకయ్య తమ్ముడు కోరం సురేందర్ కోరం ఉమ దాడికి దిగారు. బీఆర్ఎస్ బలపరిచిన వార్డు సభ్యులను కూడా పోటీలో ఉండకూడదని బెదిరింపులకు దిగారు. చంపుతా.. బయటకు రా అని బెదిరించారు. ఈ ఘటనపై పూనెం కరుణాకర్, ఇల్లెందు మాజీ ఎమ్మెల్యే హరిప్రియ నాయక్ ఆందోళన వ్యక్తం చేశారు.
నామినేషన్ కేంద్రాల వద్ద లైన్లో నిలబడిన వార్డు సభ్యులు, సర్పంచ్ అభ్యర్థిని కొట్టిన వారిపై ఎలక్షన్ చర్యలు తీసుకోవాలని కోరారు. కోయగూడెం అభ్యర్థులను చంపుతానని ఇల్లెందు ఎమ్మెల్యే తమ్ముడు కోరం సురేందర్, కోరం ఉమ చంపుతామని బెదిరింపు చర్యలకు పాల్పడుతున్నారని తెలిపారు. వీరిపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు పేర్కొన్నారు.