– రైతుకూలీ సంఘం ఆధ్వర్యంలో ప్రదర్శన
బూర్గంపహాడ్, మే 16 : బూర్గంపహాడ్ మండల పరిధిలోని నాగినేనిప్రోలు రెడ్డిపాలెం 437/1 రెవెన్యూ భూమిని బయటకు తీసి జాయింట్ సర్వే చేసి గోదావరి వరద బాధితులందరికీ ఇండ్ల స్థలాలతో పాటు ఇందిరమ్మ ఇల్లు నిర్మించి ఇవ్వాలని తెలంగాణ రైతు కూలీ సంఘం ఆధ్వర్యంలో రాష్ట్ర నాయకుడు బొర్రా ఆనంద్, జిల్లా కార్యదర్శి డి.పున్నంచంద్ డిమాండ్ చేశారు. శనివారం బూర్గంపహాడ్ మండల కేంద్రంలో నాయకులు ప్రగతిశీల మహిళా సంఘం(స్త్రీ సంఘటన), గోదావరి పోరాట కమిటీ వరద బాధితులతో కలిసి భారీ ప్రదర్శన నిర్వహించి డిప్యూటీ తాసీల్దార్కు వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 2022 నుంచి ఈ పోరాట కమిటీ ఇండ్ల స్థలాలు, ఇండ్లు కోసం పోరాటం చేస్తుందని ఈ విషయంలో మండల, జిల్లా స్థాయి అధికారులు, పాలకులు పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతి ఏటా గోదావరి ముంపునకు గురవుతూ ఇళ్లు, వాకిళ్లు కోల్పోతున్నామని వరద బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా వరద ముంపు బాధితులను ఆదుకుని ఇళ్ల స్థలాలు ఇచ్చి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేసి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో స్త్రీ సంఘటన మహిళా కార్యకర్తలు, తోలెం మమతక్క, కుంజా సోమమ్మ, సూరక్క, వెంకటేశ్వర్లు, నారాయణ పాల్గొన్నారు.