చుంచుపల్లి, ఆగస్టు 22 : చుంచుపల్లి మండలం అంబేద్కర్ నగర్ స్కూల్, ములుగుగూడెం స్కూల్ లో చదువుకునే పిల్లలకు ఎస్కే.అబ్దుల్ బాషిత్, గౌరీ శంకర్, దుర్గా ప్రసాద్ సహకారంతో యంగ్ ఇండియన్ బ్లడ్ డోనర్స్ క్లబ్ వ్యవస్థాపక అధ్యక్షుడు జరప్ల బాలు స్టేషనరీ అందజేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎంఈఓ నీరజ మాట్లాడుతూ.. ఒకవైపు అత్యవసర పరిస్థితుల్లో ఉన్న వారికి బ్లడ్ ఏర్పాటు చేస్తూ, మరో వైపు పర్యావరణ పరిరక్షణ కోసం మొక్కలు నాటడం, ప్రభుత్వ పాఠశాలలో కావాల్సిన వసతులను ఏర్పాటు చేయడం, వివిధ మెడికల్ సర్వీసెస్ అందించడం, విద్యార్థులకు కావాల్సినవి దాతల సహకారంతో అందించడం వంటి ఎన్నో కార్యక్రమాలు చేయడం అభినందనీయమన్నారు. ప్రతి ఒక్కరు సహాయం చేయడం ఓ బాధ్యతగా అలవాటు చేసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు బాలాజీ, రాములు, గ్రామ పంచాయతీ సర్పంచ్ సీతారాములు, కమిటీ చైర్మన్ రజిత, ఉపాధ్యాయులు రాము, వెంకటమ్మ పాల్గొన్నారు.