భద్రాద్రి కొత్తగూడెం, ఏప్రిల్ 24 : ఆరోగ్యవంతులైనా పౌరులే దేశానికి అసలైన సంపద అని, మనం తీసుకునే ప్రతి ముద్ద మన ఆరోగ్యానికి పెట్టుబడి కావాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అడిషనల్ కలెక్టర్ విద్యాచందన అన్నారు. శుక్రవారం స్థానిక సమీకృత కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో జిల్లా మహిళా, శిశు, దివ్యాంగ, వయోవృద్ధుల సంక్షేమ శాఖ జిల్లా అధికారిణి జె.స్వర్ణలత లెనీనా ఆధ్వర్యంలో జిల్లా స్థాయి పోషణ పక్వాడ ముగింపు కార్యక్రమం, అంగన్వాడీ కేంద్రాల్లో విద్యను అభ్యసించిన విద్యార్థులకు గ్రాడ్యుయేషన్ డే, అక్షరాభ్యాసం, అన్నప్రసన, గర్భిణీలకు శ్రీమంతాలు, జిల్లా స్థాయిలో పోషణ పక్వాడ కార్యక్రమంలో భాగంగా అత్యున్నత ప్రతిభ కనబరిచిన జిల్లా స్థాయి సీడీపీఓలకు, సూపర్వైజర్లకు, పోషణ అభియాన్ సిబ్బందికి, అంగన్వాడీ టీచర్లకు మోమొంటో, ప్రశంసా పత్రాలు అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి జిల్లా అదనపు కలెక్టర్ విద్యచందన ముఖ్య అతిథిగా విచ్చేసి మాట్లాడారు.
ఈ పోషణ పక్వాడ స్ఫూర్తిని ఈ 15 రోజులే కాకుండా, ఏడాది పొడవునా కొనసాగించే విధంగా మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యచరణ రూపొందించి అంగన్వాడీ కేంద్రాలలో నమోదైన లబ్ధిదారులకు నాణ్యమైన పౌష్టికాహారం అందజేయాలని కోరారు. 2026 పూర్తి అయ్యే నాటికి మన జిల్లా పోషకాహారలోప రహిత జిల్లాగా నిర్మించుకోవాలనే లక్ష్యం పెట్టుకుని క్షేత్రస్థాయిలో సిబ్బంది పని చేయాలని, కేవలం ఆహారం తినడం వేరు, శరీరానికి కావాల్సిన విటమిన్లు, ఖనిజాలు అందేలా ‘పోషక విలువలు’ ఉన్న ఆహారం తీసుకోవడం వేరు అని వివరించారు.
జిల్లా సంక్షేమ అధికారిణి జె. స్వర్ణలత లేనినా మాట్లాడుతూ.. పోషణ పక్వాడ 2026 కార్యక్రమంలో భాగంగా జిల్లాలో ఉన్న 2,061 అంగన్వాడీ కేంద్రాలలో నమోదైన లబ్ధిదారులతో పాటు ప్రజలలో కూడా పౌష్టికాహార విలువలపై అవగాహన పెంపొందించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా బీసీ డెవలప్మెంట్ ఆఫీసర్ విజయలక్ష్మి, జిల్లా ఎస్సీ డెవలప్మెంట్ ఆఫీసర్ శ్రీలత, వైద్య విద్య శాఖ అధికారులు సతీష్, డాక్టర్ రాకేష్, జిల్లాలోని సీడీపీఓలు, సూపర్వైజర్లు, అంగన్వాడీ టీచర్లు, పోషణ అభియాన్ సిబ్బంది, జిల్లా మహిళా సాధికారిత సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.