పాల్వంచ, మార్చి 27 : ప్రభుత్వ ఉపాధ్యాయుడు తాను దాచుకున్న జీపీఎఫ్ డబ్బులతో పాటు సంపాదిత సెలవుల డబ్బుల బిల్లులు సంవత్సరం నుంచి రాకపోవడం వల్ల చికిత్స చేయించలేని స్థితిలో ఉపాధ్యాయుడి భార్య మృతిచెందింది. దీనిని నిరసిస్తూ ఉపాధ్యాయులు తాసీల్దార్ కార్యాలయం ఎదుట ఆందోళన నిర్వహించారు. ఈ సంఘటన గురువారం పాల్వంచలో జరిగింది. పాల్వంచ పట్టణంలోని కేటీపీఎస్ ఆవరణలో గల ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల (అభ్యుదయ స్కూల్ ) లో పొదిలి సత్యనారాయణ ఇంగ్లీష్ టీచర్‌గా పని చేస్తున్నాడు. ఆయన భార్య శ్రీలత అనారోగ్యంతో బాధపడుతుంది. ప్రభుత్వం నుంచి తనకు సంవత్సరం నుంచి జిపిఎఫ్, సంపాదిత సెలవులకు సంబంధించిన బిల్లుల డబ్బులు రాక చేతిలో డబ్బులు లేకపోవడంతో మెరుగైన వైద్యం అందించలేక ఆమె మృత్యువాత పడింది. దీన్ని నిరసిస్తూ పీఆర్టీయూ ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు పాల్వంచ తాసిల్దార్ కార్యాలయం ఎదుట ఆందోళన నిర్వహించి తాసీల్దార్‌కు వినతి పత్రం అందజేశారు.
ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శి డి.వెంకటేశ్వరరావు, బి.రవి మాట్లాడుతూ.. GPF పార్ట్ ఫైనల్ డబ్బులు రాక మెరుగైన వైద్యం అందక ఉపాధ్యాయుడి భార్య మృతిచెందడం విచారకరం అన్నారు. ఈ మృతికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ ఉపాధ్యాయ ఉద్యోగులు ఆదాయపు పన్ను చెల్లించిన తర్వాత మిగిలిన సొమ్ము ZPGPF ఖాతాలో దాచుకోవడం జరుగుతుందన్నారు. వాటిని విద్య, వైద్యం, గృహ నిర్మాణానికి తీసుకునే వెసులుబాటు ఉందన్నారు.
దరఖాస్తు చేసుకున్న 15 రోజుల లోపు వారి ఖాతాలో డబ్బులు జమ చేయాల్సి ఉంటుందన్నారు. కానీ సకాలంలో ఖాతాలో డబ్బులు జమ కాకపోవడం వల్ల ఉద్యోగ ఉపాధ్యాయులకు తీవ్ర నష్టం, అన్యాయం జరుగుతుందన్నారు. వీటితో పాటుగా TSGLI, అలాగే SL రిటైర్మెంట్ బెనిఫిట్స్ అన్నీ కూడా సకాలంలో చెల్లించాలని వారు డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో పాల్వంచ మండల శాఖ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు వి.శ్రీనివాసరావు, భూక్యా శ్రీనివాస్, రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు సంఘమేశ్వరావు, పాల్వంచ మండల విద్యాశాఖ అధికారి శ్రీరామ్మూర్తి, ప్రభావతి, సుధాశ్రీ, పద్మజ, మోతిలాల్, శంకర్ పాల్గొన్నారు.