జూలూరుపాడు, మార్చి 31 : హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల వేలాన్ని ప్రభుత్వం తక్షణమే విరమించుకోవాలని ఏఐఎస్ఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శి గుగులోతు వంశీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. యూనివర్సిటీ భూముల వేలాన్ని నిలిపివేయాలంటున్న విద్యార్థుల అక్రమ అరెస్టులు హేయమైన చర్య అన్నారు. అరెస్టు చేసిన విద్యార్థి నాయకులను తక్షణమే విడుదల చేయాలని సోమవారం ఆయన డిమాండ్ చేశారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించిన 400 ఎకరాల భూమిని కాంగ్రెస్ ప్రభుత్వం ఆక్రమించుకుని వేలం వేసేందుకు సిద్ధమైనట్లు తెలిపారు. పెట్టుబడిదారుల దాహం తీర్చేందుకే భూముల అమ్మకానికి ప్రభుత్వం అడుగులు వేస్తోందన్నారు. యూనివర్సిటీల అభివృద్ధికి కృషి చేయాల్సిన రాష్ట్ర ప్రభుత్వం ఏకంగా భూములనే కొల్లగొట్టేందుకు సిద్ధమైతే భవిష్యత్లో యూనివర్సిటీల ఉనికి ప్రమాదకరంగా మారుతుందన్నారు.
న్యాయబద్ధంగా భూముల రక్షణ కోసం పోరాటాన్ని కొనసాగిస్తుంటే కాంగ్రెస్ ప్రభుత్వం విద్యార్థుల గొంతు నొక్కి అక్రమ అరెస్టులకు పాల్పడుతుందన్నారు. నియంతృత్వ విధానాలను కొనసాగించి విద్యార్థులని కూడా చూడకుండా పోలీసులతో దుశ్చర్యాలను సాధించిన ప్రభుత్వాలు కనుమరుగు కావడం ఖాయం అన్నారు. సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థుల అక్రమ అరెస్టును అఖిల భారత విద్యార్థి సమైక్య భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సమితి తీవ్రంగా ఖండిస్తున్నట్లు పేర్కొన్నారు. భూముల అమ్మకాన్ని ప్రభుత్వం విరమించుకోవాలని, లేనిపక్షంలో ఉద్యమాలను మరింత ఉధృతం చేస్తామని ఆయన హెచ్చరించారు.