రామవరం, జూలై 14 : ఆషాడంలో గోరింటాకు పెట్టుకోవడం అనేది ఒక సాంప్రదాయం మాత్రమే కాదు, ఆరోగ్యపరమైన ప్రయోజనాలు కూడా ఉన్నాయి. వర్షాకాలంలో వచ్చే చర్మవ్యాధుల నుండి రక్షించడానికి, శరీర ఉష్ణోగ్రతను తగ్గించడానికి గోరింటాకు ఉపయోగపడుతుందని సింగరేణి సేవా అధ్యక్షురాలు జి.మధురవాణి అన్నారు. సోమవారం సింగరేణి కొత్తగూడెం ఏరియా పరిధిలోని 3ఇంక్లైన్ బంగ్లో ఏరియాలోని 3 ఇంక్లైన్ క్లబ్ నందు సింగరేణి సేవ సమితి ఆధ్వర్యంలో ఆషాడ మాస గోరింటాకు పండగ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. మహిళలు ఎక్కువగా నీటితో పనిచేస్తుంటారు. కాబట్టి వాళ్ల చేతులు, కాళ్లు ఎప్పుడూ తడిగానే ఉంటాయి. దీనివల్ల వాళ్లు తొందరగా వ్యాధుల బారిన పడే అవకాశం ఉంటుందన్నారు. కాబట్టి గోరింటాకు పెట్టుకుంటే అనారోగ్యం బారిన పడకుండా ఉండొచ్చని ఆయుర్వేదం చెబుతోందన్నారు.
స్త్రీ అరచేతి మధ్యలో గర్భాశయానికి రక్తం చేరవేసే ప్రధాన నాడులు ఉంటాయి. గోరింటాకు పెట్టుకోవడం వల్ల వాటిలోని అతి ఉష్ణాన్ని లాగేస్తుంది. దీనివల్ల గర్భాశయ దోషాలు తొలగి ఆరోగ్యంగా ఉండొచ్చు అన్నారు. ఈ కార్యక్రమంలో ఇల్లెందు సేవా అధ్యక్షురాలు వి.రమ, పద్మజా కోటిరెడ్డి, కొత్తగూడెం సేవా సెక్రటరీ వై.అనిత, కొత్తగూడెం లేడీస్ క్లబ్ సెక్రటరీ సునీత మురళి, సేవా సభ్యులు, లేడీస్ క్లబ్ సభ్యులు, అలాగే ఇల్లెందు సేవా సభ్యులు, లేడీస్ క్లబ్ సభ్యులు పాల్గొన్నారు.