జూలూరుపాడు, ఏప్రిల్ 03 : జూలూరుపాడు మండల కేంద్రంతో పాటు పరిసర గ్రామాల్లో గుడ్ ఫ్రైడే వేడుకలు అత్యంత భక్తిశ్రద్ధలతో శుక్రవారం ఘనంగా జరిగాయి. లోక రక్షకుడైన యేసు క్రీస్తు మానవాళి పాప విముక్తి కోసం సిలువపై ప్రాణత్యాగం చేసిన రోజును స్మరిస్తూ క్రైస్తవులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా జూలూరుపాడు మండల కేంద్రంలోని ప్రధాన రహదారిపై క్రైస్తవ మతస్తులు భారీ సిలువ ప్రదర్శన నిర్వహించారు. క్రీస్తు పడిన శ్రమలను స్మరిస్తూ సాగిన ఈ ప్రదర్శనలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మండలంలోని అన్ని గ్రామాల్లోని చర్చిలు భక్తులతో కిటకిటలాడాయి. ఈ సందర్భంగా పాస్టర్లు క్రీస్తు త్యాగ నిరతిని, ఆయన బోధించిన ప్రేమ, కరుణ సందేశాలను వివరించారు.