పాల్వంచ, నవంబర్ 17 : పాత పాల్వంచలో గల మహాత్మాగాంధీ జ్యోతిరావు పూలే బాలికల ఉన్నత పాఠశాలలో 7వ తరగతి చదువుతున్న గండికోట సంజన, చండ్ర భావజ్ఞ సోమవారం తెల్లవారుజామున పాఠశాల నుంచి పారిపోయారు. విద్యార్థినుల అదృశ్యంపై తల్లిదండ్రులు, పోలీసులు ఆరా తీసి వారి ఆచూకీ కనుగొనడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. వివరాలు ఇలా ఉన్నాయి. కొత్తగూడెంకు చెందిన గండికోట సంజన, పాల్వంచలో ఉండే చెండ్ర భావజ్ఞ ఒకే క్లాసులో చదువుతున్నారు. సంజన తల్లి భవాని, తండ్రి పెద్దిరాజుకు మధ్య మనస్పర్ధల నేపథ్యంలో ఇద్దరు విడిగా ఉంటున్నారు. తల్లి కొత్తగూడెంలో, తండ్రి ములుగులో ఉంటున్నాడు. ఈ నేపథ్యంలో గురుకుల పాఠశాలలో చదువుతున్న సంజనకు అక్కడ చదవడం ఇష్టం లేదు. దీంతో పాఠశాల నుండి పారిపోవాలని నిర్ణయించుకుంది. తనతో పాటు చదువుతున్న చండ్ర భావజ్ఞ నను తోడుగా తీసుకుపోవాలని అనుకుంది. అనుకున్నదే తడువుగా పాఠశాలలో లెటర్ రాసి పెట్టి సోమవారం తెల్లవారుజామున 3 గంటలకు గురుకుల పాఠశాల గేటు పక్కనున్న సందులోంచి ఇద్దరూ బయటకు వచ్చేశారు.
పాఠశాల నుంచి నడుచుకుంటూ నవ భారత్ సెంటర్కు వెళ్లారు. అక్కడ ఆటో ఎక్కి కొత్తగూడెం రైల్వే స్టేషన్కు చేరుకున్నారు. సోమవారం ఉదయం 6 గంటలకు సింగరేణి ఎక్స్ప్రెస్ రైలు ఎక్కి వరంగల్లో దిగారు. అక్కడి నుండి బస్సులో సంజన తండ్రి పెద్దిరాజు ఉండే ములుగు చేరుకున్నారు. వీరిద్దరు పారిపోయిన విషయం కొత్తగూడెంలో ఉండే సంజన తల్లి భవానికి తెలిసి వెంటనే పాల్వంచ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఆ తర్వాత ములుగులో ఉండే తన భర్తకు ఫోన్ చేయగా అక్కడికి ఇంకా రాలేదని తెలిపాడు. దీంతో కంగారుపడి ములుగులో ఉన్న పెద్దిరాజు కూడా ఆ ప్రాంతంలో గాలిస్తుండగా ఈలోపు బాలికలు ఇద్దరు ములుగు చేరుకున్నారు. దీంతో వారిని అక్కడి ఉండి వెంటనే పాల్వంచకు తీసుకువచ్చారు. ఈ సంఘటనపై పాఠశాల ప్రిన్సిపాల్ క్రాంతిని సంప్రదించగా సంజన అనే విద్యార్థినికి ఇక్కడ చదవడం ఇష్టం లేక పాఠశాల నుంచి పారిపోయిందని, పక్కనున్న భావజ్ఞను తోడుగా తీసుకుని ములుగులో ఉండే కుటుంబ సభ్యుల వద్దకు చేరుకున్నదని తెలిపారు.