రామవరం, మే 29 : యూపీఎస్సీ సివిల్స్-2026 ప్రిలిమ్స్, మెయిన్స్ పరీక్షలకు ముంబైలోని హజ్ కమిటీ ఆధ్వర్యంలో నడుస్తున్న “హజ్ హౌస్ రెసిడెన్షియల్ కోచింగ్ ఇనిస్టిట్యూట్ ” అందిస్తున్న ఉచిత శిక్షణను పొందేందుకు అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మైనార్టీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఎండీ. యాకూబ్ పాషా గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ ఉచిత శిక్షణ పొందేందుకు సదరు సంస్థ జులై 13న హైదరాబాద్‌లో అర్హత పరీక్ష నిర్వహించనున్నట్లు వెల్లడించారు. అర్హత పరీక్షలో మెరిట్ సాధించిన వారికి ఒక సంవత్సరం పాటు ఉచిత శిక్షణతో భోజన, వసతి సౌకర్యం కల్పించడం జరుగుతుందన్నారు.
అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్ధులు తమ వివరాలను జూన్ 21వ తేదీ లోపు www.hajcommittee.gov.in అనే వెబ్సైట్ నందు రూ.100 పరీక్ష రుసుము చెల్లించి ఆన్లైన్లో నమోదు చేసుకోవాలన్నారు. ఈ అవకాశాన్ని ముస్లింలు, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ అభ్యర్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఇతర వివరాలకు 8520860785 నంబర్‌కు సంప్రదించాలని పేర్కొన్నారు.