రామవరం, జూలై11 : భవన నిర్మాణ, అసంఘటిత కార్మికులు సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉండేందుకు రాష్ట్ర ప్రభుత్వం కార్మిక శాఖ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాన్ని శుక్రవారం చుంచుపల్లి మండలం రుద్రంపూర్ పంచాయతీలో నిర్వహించింది. ఇందులో భాగంగా కామన్ సర్వీస్ సెంటర్ (సిఎస్సి) హెల్త్ కేర్ ఆధ్వర్యంలో లేబర్ కార్డు కలిగిన నిర్మాణ రంగం కార్మికులకు 50 రకాల వైద్య పరీక్షలు ఉచితంగానే చేయనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. కార్మికులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. భవన నిర్మాణ రంగంలో పనిచేసే కార్మికులు కూలీ పని, తాపీ మేస్త్రీ, ఫ్లంబర్, టైల్స్, పాల్ సీలింగ్, ఎలక్ట్రిషన్, కార్పెంటర్, పేయింటర్స్, బ్రిక్స్ వర్కర్స్, గ్లాస్ వర్కర్స్ తదితర కార్మికులకు ఉచితంగా వైద్య పరీక్షలు చేయడం జరుగుతుందన్నారు. ముఖ్యంగా బీపీ, షుగర్, థైరాయిడ్, హెచ్డిఏ, బ్లడ్, మిటమిన్ డి, ఈసిజి, హైపటైటీస్ బి, సి, పిఎఫ్టి, ఊపిరితిత్తుల పరీక్షలు, కాన్సర్, ఎయిడ్స్ వంటి వ్యాధులకు పరీక్షలు చేయడం జరుగుతుందని తెలిపారు.
పరీక్షలు చేయించుకున్న పది రోజుల్లోపే కార్మికుల రిపోర్ట్‌లను మాన్యువల్‌గా కార్మికులకు అందించి ఆరోగ్య పరిస్ధితిని వివరించనున్నట్లు తెలిపారు. ఆరోగ్య సమస్యలు ఉన్న వారికి ప్రభుత్వ దవాఖానల్లో వైద్యం అందించే ఏర్పాట్లు చేయనున్నట్లు తెలిపారు. వైద్య శిబిరాల్లో పరీక్షలు చేయించుకున్న కార్మికులకు తెలంగాణ భవన, ఇతర నిర్మాణ కార్మిక సంక్షేమ మండలి పేరుతో ప్రత్యేకంగా క్యూఆర్ కోడ్‌తో రూపొందించిన హెల్త్ స్క్రీనింగ్ కార్డులు ఇవ్వడంతో పాటు ఆరోగ్య వివరాలను ఆన్లైన్లో నమోదు చేస్తారని సూపర్వైజర్ ప్రవీణ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ల్యాబ్ టెక్నీషియన్ జ్యోతిక, మాజీ ఎంపిటిసి ఇల్లా పరమేశ్, సిపిఐ పార్టీ రుద్రంపూర్ శాఖ సెక్రెటరీ తోటరాజు, భవన నిర్మాణ సంఘం నాయకుడు రాములు, అసంఘటిత కార్మికులు పాల్గొన్నారు.