జూలూరుపాడు, మార్చి 22 : కార్మిక నాయకుల అక్రమ అరెస్టులను ప్రతి ఒక్కరూ ఖండించాలని టీయూసీఐ జిల్లా ఉపాధ్యక్షుడు ఎదులాపురం గోపాలరావు, కొత్తగూడెం ఏరియా ఉపాధ్యక్షుడు రాయల సిద్దు అన్నారు. శనివారం హైదరాబాదులో ఇందిరా పార్క్ వద్ద జరిగే కార్మిక సంఘాల జేఏసీ ధర్నాకు వెళ్లకుండా వారిని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు పోలీసులు అరెస్టు చేసి స్టేషన్కు తరలించారు. ఈ చర్యను వారు తీవ్రంగా నిరసించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రజా పాలన పేరుతో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్య హక్కులను హరించివేయటం సరికాదన్నారు. రాష్ట్ర బడ్జెట్లో కార్మిక వర్గానికి తీవ్ర అన్యాయం జరిగిందన్నారు. తెలంగాణ రాష్ట్రంలో అసంఘటిత కార్మిక వర్గం కోటి మందికి పైగా ఉన్నారని, నేడు రాష్ట్రంలో పెరిగిపోతున్న ధరలతో, చాలీచాలని జీతాలతో వీరంతా సతమతమవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 2021లో ఆనాడు కేసీఆర్ ప్రభుత్వం ఐదు కనీస వేతనాల జీవోలను ఫైనల్ నోటిఫికేషన్ ఇచ్చినట్లు చెప్పారు. కనీస వేతనాల సలహా మండలిలో గత ప్రభుత్వం, యాజమాన్యం, కార్మిక సంఘాల ప్రతినిధుల మధ్య జరిగిన సుదీర్ఘ చర్చల అనంతరం కనీస వేతనాల జీవోలను ఫైనల్ చేశారని, జీవోలను ప్రభుత్వం గెజిట్ చేయలేదన్నారు. 2021 జూన్లో విడుదల చేసిన జీవోలను నేటికీ గెజిట్ ముద్రించకపోవడం దుర్మార్గం అన్నారు.
2021 లో విడుదల చేసిన 5 జీవోలలో జీవో నెంబర్ 21 సెక్యూరిటీ సర్వీసెస్, జీవో నెంబర్ 22 రోడ్డు అండ్ బిల్డింగ్ వర్కర్స్, జీవో నెంబర్ 23 స్టోర్ బ్రేకింగ్ వర్కర్స్, జీవో నెంబర్ 24 కన్స్ట్రక్షన్స్ అండ్ మల్టీపర్పస్ ప్రాజెక్ట్ వర్కర్స్, జీవో నెంబర్ 25 ప్రైవేట్ మోటార్ వర్కర్స్ అయిదు జీవోలలో కనీస బేసిక్ వేతనం రూ.18 నుంచి 19 వేలుగా నిర్ధారించినట్లు చెప్పారు. నాటి నుండి వీడిఏ పాయింట్లు కలుపుకుంటే నేడు అది రూ.22 వేలు అవుతుందన్నారు. ఈ జీవోలను గెజిట్ చేస్తే వీటి ప్రాతిపదికగా మిగతా జీవోలను కూడా సవరిస్తే కార్మిక వర్గానికి ఊరట లభిస్తుందన్నారు. ప్రభుత్వం కొన్ని సంవత్సరాలుగా జీవోలను సవరించకుండా కాలం గడపడం సరైంది కాదన్నారు. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం తక్షణమే ఫైనల్ నోటిఫికేషన్ ఇచ్చిన ఐదు జీవోలను గెజిట్ చేయాలని డిమాండ్ చేశారు.