కొత్తగూడెం అర్బన్, ఏప్రిల్ 25 : వేడి నీళ్లలో పడి తీవ్ర గాయాలపాలై ప్రాణాపాయ స్థితిలో ఉన్న చిన్నారికి పాల్వంచ పట్టణానికి చెందిన “టీఎన్ఆర్ ట్రస్ట్” అధినేత తాండ్ర వెంకటేశ్వరరావు శుక్రవారం రూ.30 వేలు ఆర్థిక సాయం అందించారు. కొత్తగూడెం పట్టణంలోని రామవరం ప్రాంతానికి చెందిన ఆటో డ్రైవర్ కళ్యాణ్ పాసి, సబియానాజ్ దంపతుల నాలుగేళ్ల కుమార్తె క్రితిక ఈ ఏడాది జనవరిలో స్నానానికి తోడి ఉంచిన వేడి నీళ్ల బకెట్లో పడడంతో తీవ్ర గాయాలయ్యాయి.
పాప చికిత్స కోసం ఇప్పటికే రూ.5 లక్షలు ఖర్చు అయింది. రెక్కాడితే డొక్కాడని ఆటో డ్రైవర్ కుటుంబం తమ పాపను రక్షించుకోవాలని అందినకాడికి అప్పులు చేసి ఆస్పత్రుల చుట్టూ తిరుగుతున్నారు. పాప చికిత్స కోసం దాతలు స్పందించి ఆదుకోవాలని తల్లిదండ్రులు వేడుకున్నారు. విషయం తెలుసుకున్న పాల్వంచ పట్టణానికి చెందిన టిఎన్ఆర్ ట్రస్ట్ అధినేత తాండ్ర వెంకటేశ్వరరావు రూ.30 వేల ఆర్థిక సాయం అందించారు. ట్రస్ట్ సభ్యుడు రామవరం పాప ఇంటికి వెళ్లి తల్లిదండ్రులకు నగదును అందజేశారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ సభ్యులు తాండ్ర బుచ్చిబాబు, తాండ్ర నాగబాబు, ములకలపల్లి మండల పరిషత్ మాజీ ఉపాధ్యక్షుడు పుల్లారావు, మాజీ కౌన్సిలర్ తొగర రాజశేఖర్, తాండ్ర మణికంఠ, మారెడ్ల నరసింహారెడ్డి, పలువురు ఆటో డ్రైవర్లు పాల్గొన్నారు.