బూర్గంపహాడ్, జూన్ 23 : బూర్గంపహాడ్‌కు చెందిన ఫొటోగ్రాఫర్ భజన మల్లయ్య ఇటీవల అనారోగ్యంతో మృతిచెందగా బూర్గంపహాడ్ మండల ఫొటోగ్రాఫర్ల వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు దాసరి బాలకృష్ణ ఆధ్వర్యంలో రాష్ట్ర, జిల్లా అసోసియేషన్ల సహకారంతో మంగళవారం మల్లయ్య కుటుంబ సభ్యులకు రూ.1.60 లక్షల కుటుంబ భరోసా ఆర్ధిక సాయం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర వ్యాప్తంగా ఫొటోగ్రాఫర్లు ఒక సంఘంగా ఏర్పడి రాష్ట్ర అధ్యక్షుడు ఎస్.హుస్సేన్ సారధ్యంలో ఈ పథకాన్ని ఆవిష్కరించుకున్నారని, 20 వేల సభ్యులతో కొనసాగుతున్న ఈ సంఘంలో ప్రతి ఫొటోగ్రాఫర్ రూ.10 చొప్పున సంఘం ఖాతాలో జమ చేయాలని.. అప్పుడు రూ.1.70 లక్షలు సంఘం ఖాతాలో జమ అవుతాయని వీటిని ఎవరైనా సభ్యుడు మరణిస్తే రూ.1.60 లక్షలు చొప్పున బాధిత కుటుంబానికి అందజేయడం జరుగుతుందని, రూ.10 వేలు వైద్యఖర్చులకు అందిస్తామని తెలిపారు. ఈ నగదుతో ఓ ఫొటోగ్రాఫర్ కుటుంబానికి కుటుంబ భరోసా కల్పించినట్లవుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఫొటోగ్రాఫర్ల వెల్ఫేర్ అసోసియేషన్ మండల కార్యదర్శి ఆవుల వెంకటరమణారెడ్డి, కోశాధికారి మేడి శేషగిరి, జిల్లా అధ్యక్షుడు కీసర సుధాకర్‌రెడ్డి, జిల్లా కన్వీనర్ పంపన రమేష్, ఉపాధ్యక్షులు మూర్తి, విజయ్, మండల ఫొటోగ్రాఫర్లు పాల్గొన్నారు.