రామవరం, అక్టోబర్ 23 : వీధి లైట్లు లేని దారి ఒక వైపు, లోతైన గుంతలు మరోవైపు ఆదమరిస్తే గాయాలపాలు కావాల్సిందే. సింగరేణి కొత్తగూడెం ఏరియా పరిధిలోని రుద్రంపూర్ లోని తెలంగాణ ఉద్యమ స్ఫూర్తి ప్రాంగణం నుండి జాతీయ రహదారికి కలిసే రోడ్డుపై నిత్యం కార్మికులు వారి అవసరాల కోసం జీఎం కార్యాలయం, ప్రభావిత ప్రాంత ప్రజలు రుద్రంపూర్ నుండి పెనగడప, అంబేద్కర్ నగర్, రాంపురం వెళ్లేవారు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వెళ్లే రోగులు రోడ్డు గుండా ప్రయాణిస్తూ ఉంటారు. అంతేకాకుండా సత్తుపల్లికి కార్మికులను విధులకు తీసుకువెళ్లే బస్సులు కూడా ఈ మార్గం గుండానే ప్రయాణిస్తూ ఉంటాయి. గత కొన్ని రోజులుగా ఈ రోడ్డుపై పెద్దపెద్ద గుంతలు ఏర్పడడంతో కార్మికులు, ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. గతంలో మరమ్మతులు చేపట్టినప్పటికీ మళ్లీ రోడ్డు పూర్తిగా ధ్వంసమైంది. కాలనీలలో కూడా చాలా ప్రాంతాల్లో రోడ్లు పూర్తిగా ధ్వంసం అయ్యాయని, ఎప్పుడో ఏళ్ల క్రితం వేసిన రోడ్డు కావడంతో ఎక్కడ చూసినా గుంతలే ఉంటున్నాయి. వర్షం పడితే మడుగులను తలపిస్తున్నాయి. అధికారులు స్పందించి రోడ్డు మరమ్మతు పనులు చేపట్టాలని కార్మికులు, ప్రభావిత ప్రాంత ప్రజలు కోరుతున్నారు.