రామవరం, ఏప్రిల్ 22 : మనిషిని మనిషిగా, మానవతా విలువలు కలిగిన మంచి వాడిగా తీర్చిదిద్దేందుకు పండుగలు దోహదం చేస్తాయని కొత్తగూడెం సింగరేణి కాలరీస్ పివికే పై 5ఇంక్లైన్ గని మేనేజర్ శ్యామ్ ప్రసాద్ అన్నారు. మంగళవారం గనిలో జరిగిన ఈద్ మిలాఫ్ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. కులమతాలకు అతీతంగా అందరూ కలిసి పండుగలు జరుపుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. జమాతే ఇస్లామి హింద్ సభ్యుడు షేక్ అబ్దుల్ బాసిత్ మాట్లాడుతూ.. రంజాన్ ఉపవాసాలు ఆకలి అంటే ఏమిటో ఆచరణాత్మకంగా తెలుసుకుని ఆకలితో అల్లాడే పేదవారికి సహాయం చెసే గుణాన్ని అలవర్చుకునేలా చేస్తాయన్నారు. తల్లిదండ్రుల పట్ల మంచితనంతో వ్యవహరించాలి అని, బంధువులు, ఇరుగు పొరుగు వారితో సత్సంబంధాలు కలిగి ఉండటమే నిజమైన ఆరాధన అని తెలిపారు.
కార్మిక సంఘాల నాయకులు వట్టికొండ మల్లికార్జున్, మహమ్మద్ రజాక్ మాట్లాడుతూ.. కుల మత భేదభావం లేకుండా అందరూ కలిసి అన్ని పండుగలను జరుపుకునే సంప్రదాయం కేవలం కొత్తగూడెం ఏరియాలోనే ఉండటం గర్వకారణం అన్నారు. సీనియర్ ఇంజినీర్ నజీర్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో సేఫ్టీ ఆఫీసర్ కిశోర్, సంక్షేమ అధికారులు హరీశ్, షకీల్, ఇంజినీర్ శ్రీనివాస్, కార్మిక సంఘాల నాయకులు గట్టయ్య, రాజయ్య, వీరాస్వామి, హుమాయున్, ఆంజనేయులు, వీరభద్రం, ఆసీఫ్, ఈద్ మీలాబ్ కమిటీ సభ్యులు మొహమ్మద్ ఉమర్, రఫీ, జానీ, ఖాజా పాషా, రబ్బానీ, అక్తర్ అలి, అక్బర్, సమీర్, మనోహర్, సలీం పాల్గొన్నారు.