కొత్తగూడెం అర్బన్, సెప్టెంబర్ 25 : విధుల పట్ల అంకితభావంతో పనిచేయడమే కాకుండా, సేవా భావం కలిగిన వ్యక్తి ఫయాజ్ మొయినుద్దీన్ అని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా న్యాయమూర్తి వసంత్ పాటిల్ అన్నారు. ఉద్యోగ సంఘం నాయకుడిగా అనునిత్యం నిజాయితీ, క్రమశిక్షణతో ఫయాజ్ పనిచేశారని కొనియాడారు. వైద్య ఆరోగ్య శాఖలో డిప్యూటీ డెమోగా పనిచేసే ఫయాజ్ మొయినుద్దీన్ ఉద్యోగ విరమణ సభను జిల్లా కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్ గురువారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా న్యాయమూర్తి హాజరై మాట్లాడారు. ఫయాజ్ లాంటి సేవ గుణమున్న వ్యక్తులు సమాజంలో చాలా అరుదుగా ఉంటారని ప్రశంసించారు. ఉద్యోగులు ఫయాజ్ సేవా భావాన్ని ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. డీఎం అండ్ హెచ్ఓ డాక్టర్ జయలక్ష్మి మాట్లాడుతూ.. ఫయాజ్ చేసిన సేవలను వివరిస్తూ, ఆయన సుదీర్ఘ సేవా కాలంలో ప్రజారోగ్య రంగానికి అందించిన సేవలు మరువలేనివన్నారు.
తనకున్న అనుభవంతో అధికారులకు, ఉద్యోగులకు సరైన సలహాలు ఇస్తూ కార్యక్రమాలు విజయవంతం కావడంలో పెద్దన్న పాత్ర పోషించారని కొనియాడారు. తెలంగాణ హెల్త్ ఎడ్యుకేషన్ అండ్ మీడియా ఆఫీసర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు కొప్పు ప్రసాద్ మాట్లాడుతూ.. ఫయాజ్ మొహియుద్దిన్ పబ్లిక్ హెల్త్ అండ్ మెడికల్ ఎంప్లాయీస్ యూనియన్ 3194లో జిల్లా అధ్యక్షుడిగా పని చేస్తూ, అవసరమైన వ్యక్తులకు, శాఖా సిబ్బందికి నిస్వార్థ సేవలు అందించి అన్ని విధాలుగా తోడ్పాటు అందించారన్నారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ సైదులు, ప్రోగ్రాం అధికారులు, ఐఎంఏ వైద్యులు, సహోద్యోగులు, స్నేహితులు పాల్గొని ఆయనకు శుభాకాంక్షలు తెలిపి శేష జీవితం ఆనందంగా గడపాలని ఆకాంక్షించారు.
Kothagudem Urban : సేవా తత్పరుడు ఫయాజ్ మొయినుద్దీన్ : న్యాయమూర్తి వసంత్ పాటిల్