లక్ష్మీదేవిపల్లి, ఆగస్టు 28 : రైతులకు యూరియా కష్టాలు తప్పడం లేదు. లక్ష్మీదేవిపల్లి మండలంలోని రైతులు వారం రోజులుగా యూరియా కోసం కార్యాలయం చుట్టూ తిరుగుతున్న ప్రయోజనం లేకుండా పోయింది. సరఫరా చేస్తున్న ఒకటి, రెండు బస్తాలు ఎటూ సరిపోక రైతులు నానా అవస్థలు పడుతున్నారు. యూరియా కోసం రైతులు గురువారం ఉదయం నుండి కార్యాలయం ముందు పడిగాపులు కాస్తున్నారు. మండల వ్యాప్తంగా రైతుల సీరియల్ నంబర్ పరంగా వారి పేరు వస్తేనే కూపన్ ఇస్తూ ఒక రైతుకు రెండు యూరియా బస్తాలు మాత్రమే అందిస్తున్నారు. ఈ రెండు బస్తాలు ఏ మూలకు సరిపోని పరిస్థితి. యూరియా కోసం ఇంకెన్నాళ్లు కష్టాలు పడాలో అంటూ రైతులు తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి రైతుల యూరియా కష్టాలు తీర్చాలని కోరుతున్నారు.